కేటీఆర్ అరెస్టు.. ఇక అంతే సంగతులా?
Publish Date:Feb 17, 2025
Advertisement
ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ అరెస్టు అంటే నెల రోజుల కిందటి వరకూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ కేసులో కేటీఆర్ నిండా ఇరుక్కున్నారనీ, ఇహనో ఇప్పుడో ఆయన అరెస్టు ఖాయమని రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఈడీ, ఏసీబీ కూడా ఆయనను విచారించాయి. కోర్టు కూడా ఆయనకు అరెస్టు నుంచి పూర్తి రక్షణ కల్పించలేదు. ఈ కేసులో ఈడీ విచారణలో సీనియర్ ఐఏఎస్ అధికారులు ఇరువురు కేటీఆర్ కు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చారని కూడా వార్తలు వచ్చాయి. దీంతో సంక్రాంతి తరువాత ఏ క్షణంలోనైనా కేటీఆర్ అరెస్టు అవుతారని పరిశీలకులు కూడా విశ్లేషించారు. కేటీఆర్ కూడా తన అరెస్టు లాంఛనమేనన్న భావనకు వచ్చేశారనీ, అందుకే అరెస్టు అయితే ఫిట్ నెస్ పెంచుకుని జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత పాదయాత్ర చేస్తానని ప్రకటించారు కూడా. అయితే సంక్రాంతి వచ్చింది, వెళ్లిపోయింది కూడా. సంక్రాంతి వెళ్లి నెల రోజులు దాటిపోయింది. అయినా కేసీఆర్ అరెస్టు కాదు కదా, అసలు ఈ ఫార్ములా రేసు కేసు దర్యాప్తు పరోగతి కూడా ఏమీ లేకుండా పోయింది. అసలు ఈడీ, ఏసీబీలు ఆ కేసు దర్యాప్తు సంగతే మరచిపోయాయా అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఈ కేసుకు సంబంధించి కాంగ్రెస్ కూడా ఏమీ మాట్లాడటం లేదు. ఈ కేసుకు సంబంధించి తెరవెనుక ఏదైనా జరిగిందా అన్న అనుమానాలు జనబాహుల్యంలో వ్యక్తం అవుతున్నాయి. కేటీఆర్ ఇటీవల హస్తినలో పర్యటించారు. కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా ఏమైనా జరిగి ఈ కేసు దర్యాప్తు వెనక్కు వెళ్లిందా అంటూ రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. హస్తిన ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి తరువాత.. అవినీతి కేసులో అరెస్టైతే ప్రజల సానుభూతి ఉండదన్న విషయం తేటతెల్లమైపోయిందనీ, సో ఇక కేటీఆర్ ను అరెస్టు చేస్తే సానుభూతి వెల్లువెత్తుతుందన్న భరోసా లేకపోవడంతో రేవంత్ సర్కార్ కేటీఆర్ అరెస్టు విషయంలో మరింత దూకుడుగా ముందుకు వెడుతుందనీ పరిశీలకులు అంచనా వేశారు. అయితే అందుకు భిన్నంగా ఈ కేసు గురించి దర్యాప్తు సంస్థలు, అధికార కాంగ్రెస్ కూడా పూర్తిగా మౌనం వహించడంతో ఈ ఫార్ములా రేసు కేసు ఇక అంతే సంగతులా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
http://www.teluguone.com/news/content/eformula-race-case-39-192990.html





