హైదరాబాద్ లో ఎబోలా వైరస్ కలకలం
Publish Date:Jun 5, 2026
Advertisement
హైదరాబాద్ ప్రజలను ఎబోలా వైరస్ బెంబేలెత్తిస్తోంది. ఖండాంతరాలను దాటి ఈ మహమ్మారి నగరంలోకి ప్రవేశించిందా అనే అనుమానాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. సూడాన్ దేశం నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఎబోలా లక్షణాలతో గాంధీ ఆస్పత్రిలో చేరడం ఈ ఆందోళనకు కారణమైంది. ఈ మొత్తం వ్యవహారంలో తొలి కేసు గురువారం( జూన్ 4) శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వెలుగుచూసింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్‌పోర్ట్‌లో సాధారణంగా నిర్వహించే స్క్రీనింగ్ పరీక్షల సమయంలో సూడాన్ జాతీయుడైన అబ్దుల్ మజీద్ అనే వ్యక్తిలో ఎబోలా వైరస్ లక్షణాలను మెడికల్ టీమ్ గుర్తించింది. విపరీతమైన జ్వరం, ఎబోలా అనుమానిత లక్షణాలు ఉండ టంతో వైద్య బృందం వెంటనే అప్రమత్తమై ప్రత్యేక అంబులెన్స్‌లో నేరుగా గాంధీ ఆస్పత్రి ఐసోలేషన్‌కు తరలించింది. ఆ తరువాత శుక్రవారం (జూన్ 5) రెండో అనుమానిత కేసు గాంధీ ఆస్పత్రికి వచ్చింది. సుడాన్ కే చెందిన మహమ్మద్ యాయా యగౌచ్ అహ్మద్ కూడా ఎబోలా లక్షణాలతో గాంధీ ఆస్పత్రిలో చేరాడు. ఇతడు కొంతకాలంగా హైదరాబాద్ నగరంలోనే ఉంటూ చదువుకుంటున్నాడనీ, ఇటీవలే సూడాన్ వెళ్లి తిరిగి వచ్చాడని తేలింది, సుడాన్ నుంచి వచ్చిన కొద్ది రోజుల్లోనే తీవ్రమైన జ్వరం, ఇతర ఇబ్బందులు తలెత్తడంతో గాంధీ ఆస్పత్రి వైద్యులను ఆశ్రయించినట్లు వెల్లడైంది. ఎబోలా అనేది ఒకరి నుంచి ఒకరికి అత్యంత వేగంగా సంక్రమించే ప్రాణాంతకమైన వ్యాధి కావడంతో, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్, ప్రత్యేక వైద్య బృందం తక్షణ రక్షణ చర్యలు ప్రారంభించారు. సాధారణ రోగులకు ఈ వైరస్ వ్యాపించకుండా ఉండేందుకు గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎబోలా ఐసోలేషన్ వార్డు కు వీరిద్దరినీ తరలించారు. ఈ ప్రత్యేక వార్డులో కట్టుదిట్టమైన నిఘా నడుస్తోంది. వీరికి చికిత్స అందిస్తున్న, పర్యవేక్షిస్తున్న వైద్యులు, నర్సులు, ఇతర పారామెడికల్ సిబ్బంది కూడా అత్యంత జాగ్రత్తగా పీపీఈ కిట్లు ధరించి సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతానికి వీరిద్దరిలో ఎబోలా వైరస్ ఉందా అన్నది నిర్ధారణ కాలేదు. వీరి నుంచి రక్త నమూనాలను సేకరించి, వాటిని అధికారిక నిర్ధారణ కోసం పుణె నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపుతారు. అక్కడ నుంచి వచ్చే నివేదికల ఆధారంగానే వీరికి ఎబోలా సోకిందా లేదా అనేది అధికారికంగా స్పష్టమవుతుంది. అంతవరకు వీరిద్దరినీ పూర్తి క్వారంటైన్‌లో ఉంచి ప్రత్యేక వైద్య పర్యవేక్షణలోనే ఉంచుతారు.
http://www.teluguone.com/news/content/ebola-virus-scare-in-hyderabad-36-221878.html





