ఔను నిజమే.. ఇ20 పెట్రోల్ మైలేజీ ఇవ్వదు.!
Publish Date:Jul 31, 2026
Advertisement
ఎట్టకేలకు అంగీకరించిన కేంద్ర మంత్రి గడ్కరీ.! ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ వాహనాల మైలేజీని తగ్గిస్తుందన్న మాట నిజమేనని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఎట్టకేలకు బహిరంగంగా అంగీకరించారు. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపడం ద్వారా వాహనాల మైలేజ్ తగ్గిపోతోందని, ఇంజిన్లు పాడవుతున్నాయని వాహనదారులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి సామాజిక మాధ్యమంలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. అయితే ఇంత కాలంగా కేంద్రం ఆ ఆందోళనలను, ప్రచారాన్ని పెడచెవిన పెట్టింది. అయితే ఎట్టకేలకు పార్లమెంటు వేదికగా, వాహనదారులలో పెరుగుతున్న అనుమానాలు, ఆందోళనలు, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై గడ్కరీ నోరు విప్పారు. ఇథనాల్ బ్లెండింగ్ (ఇ20) పెట్రోల్ వల్ల వాహనాల మైలేజ్‌పై ప్రభావం పడుతుందని అంగీకరించారు. పార్లమెంటు వేదికగా మాట్లాడిన గడ్కరీ.. అయితే వాహనదారులు ఆందోళన చెందాల్సినంతగా ఇ20 పెట్రోలు వల్ల మైలేజీ తగ్గదని వివరించారు. ఇ20 పెట్రోల్ కారణంగా మహా అయితే.. వాహనాల మైలేజీ ఆరు శాతం తగ్గుతుందన్నారు. కేంద్ర మంత్రి గడ్కరీ పార్లమెంట్లో వెల్లడించిన వివరాల ప్రకారం, వాహనం రకం, మోడల్ వినియోగించిన కాలం ఆధారంగా ఈ మైలేజ్ తగ్గుదల అనేది 2 నుంచి 6 శాతం మధ్య ఉంటుందని పరిశోధనల్లో తేలింది. ఇథనాల్‌లో ఉండే కలోరిఫిక్ విలువ పెట్రోల్ కంటే తక్కువగా ఉండటమే ఈ స్వల్ప మైలేజ్ తగ్గుదలకు కారణమని గడ్కరీ చెప్పారు. ఇండియా ముడి చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి, పర్యావరణ పరిరక్షణకు కేంద్రం E20 ప్రాజెక్ట్‌ను తీసుకువచ్చిందన్న ఆయన.. ఈ ఏడాది ఏప్రిల్ నుండి దేశవ్యాప్తంగా ఉన్న ఇంధన విక్రయ కేంద్రాలలో ఇ20 పెట్రోల్ విక్రయాలను తప్పనిసరి చేసినట్లు చెప్పారు. అయితే కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై వాహనదారుల నుండి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే, ఇథనాల్ బ్లెండింగ్ విధానంపై గడ్కరీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. గడ్కరీ కుమారుడు నిఖిల్ గడ్కరీతో సంబంధం ఉన్న సియాన్ ఆగ్రో అనే సంస్థ ఆదాయం ఇథనాల్ విధానం అమలులోకి వచ్చాక విపరీతంగా పెరిగిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వ్యక్తిగత వ్యాపార ప్రయోజనాల కోసమే ప్రభుత్వం ఇథనాల్ బ్లెండింగ్‌ను వేగవంతం చేస్తోందని విపక్షాలు విమర్శస్తున్నాయి. ఈ20 పెట్రోల్ రేట్లు తగ్గకపోవడం, మైలేజ్ కూడా 6 శాతం వరకు తగ్గడంతో సామాన్య వాహనదారులు సైతం కేంద్రం నిర్ణయం పట్ల తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గడ్కరీ మైలేజీ తగ్గుదల వాస్తవమే అని ఒప్పుకున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికైనా క్షేత్రస్థాయి వాస్తవాలను దృష్టిలో ఉంచుకుని పాత వాహనదారులకు ఉపశమనం కలిగించేలా, ఇంధన నాణ్యత, ధరలపై స్పష్టత ఇచ్చి.. వాహనదారులకు ఉపశమనం కలిగించే చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. Nitin Gadkari ethanol blending, E20 fuel efficiency, ethanol petrol mileage loss, Cian Agro Gadkari controversy
http://www.teluguone.com/news/content/e20-petrol-doesnt-deliver-good-mileage-36-227631.html




