పచ్చని పొలాల్లో చెత్త డంపింగ్ యార్డు వద్దు.. జీవో 641 రద్దు చేయాలి..!
Publish Date:Jul 13, 2026
Advertisement
రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం సిద్దాపూర్ గ్రామ పరిధిలో ప్రతిపాదిత చెత్త డంపింగ్ యార్డు ఏర్పాటును వ్యతిరేకిస్తూ సిద్దాపూర్, కొడిచర్లతో పాటు పరిసర తండాల గ్రామస్తులు సోమవారం భారీ ఆందోళన చేపట్టారు. జీవో నంబర్ 641ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది జాతీయ రహదారిపై ధర్నాకు దిగడంతో కొంతసేపు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడి భారీ వాహనాలు నిలిచిపోయాయి. డంపింగ్ యార్డు వ్యతిరేక జేఏసీ ఆధ్వర్యంలో గ్రామంలో సమావేశమైన గ్రామస్తులు అనంతరం ర్యాలీగా జాతీయ రహదారికి చేరుకుని నిరసన తెలిపారు. కాలుష్యానికి కారణమయ్యే చెత్త డంపింగ్ యార్డును పచ్చని పంట పొలాల మధ్య ఏర్పాటు చేయడం సరికాదని వారు ప్రభుత్వాన్ని కోరారు. డంపింగ్ యార్డు వల్ల వ్యవసాయ భూములు, భూగర్భ జలాలు కాలుష్యానికి గురవుతాయని, రైతుల జీవనాధారం ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జీవో 641ను రద్దు చేసే వరకు తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నా నేపథ్యంలో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనతో జాతీయ రహదారిపై కొంతసేపు భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
http://www.teluguone.com/news/content/dumping-yard-36-225859.html





