వేడివేడి బజ్జీలు వికటించి.. 23 మందికి ఫుడ్ పాయిజన్
Publish Date:Jun 29, 2026
Advertisement
వేడివేడి బజ్జీల వాసనతో ఆకర్షితులైన స్థానికులు వాటిని ఆస్వాదించేందుకు ఆగిపోయారు. రహదారి పక్కన బండిపై విక్రయిస్తున్న బజ్జీలను కొనుగోలు చేసి తిన్నారు. అయితే ఆ రుచి క్షణాల్లోనే చేదు అనుభవంగా మారింది. బజ్జీలు తిన్న కొద్దిసేపటికే ఒక్కొక్కరిగా వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా కాజులూరు మండలం దుగ్గుదూరు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామంలోని రహదారి పక్కన బండిపై విక్రయించిన బజ్జీలు తిన్న మొత్తం 23 మందిలో ఫుడ్ పాయిజన్ లక్షణాలు కనిపించాయి. బాధితులకు వాంతులు, విరేచనాలు తీవ్రంగా ఉండటంతో కుటుంబ సభ్యులు వారిని వెంటనే సమీప ఆస్పత్రులకు తరలించారు. ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో ప్రజలు అస్వస్థతకు గురికావడంతో గ్రామంలో ఆందోళన నెలకొంది. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. బజ్జీల నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పంపించినట్లు తెలిసింది. ఫుడ్ పాయిజన్‌కు కారణం కలుషిత నూనెనా, నాసిరకం పదార్థాలా, లేక పరిశుభ్రత లోపమా అన్న కోణాల్లో అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పరీక్షల నివేదికలు వచ్చిన తర్వాతే అసలు కారణం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
http://www.teluguone.com/news/content/dugguduru-36-224513.html





