లేడీ యాంకర్ పై దూషణలు.. ఆమె మైక్ విసిరికొట్టి వాకౌట్.. లైవ్ లోనే డొనాల్డ్ ట్రంప్ అరాచకం!
Publish Date:Jun 8, 2026
Advertisement
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వివాదాస్పద వైఖరితో మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈ సారి ఏకంగా లేడీ యాంకర్ ను లైవ్ లోనే అనుచిత భాషలో దూషించడమే కాకుండా, మైక్ విసిరి కొట్టి వాకౌట్ చేశారు. ట్రంప్ తీరు తీవ్ర సంచలనం సృష్టించింది. ఒక దేశాధినతగా ట్రంప్ ఇలా వ్యవహరించి ఉండకూడదని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెడితే.. ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ ఎన్బీసీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మీట్ ది ప్రెస్ టాక్ షో లైవ్ ఇంటర్వ్యూలో ఊహించని హైడ్రామా చోటుచేసుకుంది. ఇంటర్వ్యూ మధ్యలోనే ట్రంప్ తీవ్ర ఆగ్రహానికి గురై.. షో హోస్ట్, సీనియర్ మహిళా యాంకర్ క్రిస్టెన్ వెల్కర్‌పై దారుణమైన పదజాలంతో విరుచుకుపడ్డారు. తన చేతిలో ఉన్న మైక్రోఫోన్‌ను లైవ్ కెమెరాల ముందే నేలపైకి విసిరికొట్టి, ఇంటర్వ్యూను మధ్యలోనే బహిష్కరించి వెళ్లిపోయారు. ఈ ఉదంతం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది. కాలిఫోర్నియా ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ జాప్యంపై ఆ ఇంటర్వ్యూలో ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నాలుగైదు రోజులు గడుస్తున్నా ఇంకా ఫలితాలు ఎందుకు వెల్లడించడం లేదంటూ ఆయన ప్రశ్నించారు. అక్కడ ఎన్నికల్లో పెద్ద ఎత్తున మోసం జరుగుతోందని, రిగ్గింగ్ చేస్తున్నారని ట్రంప్ ఆరోపించారు. అయితే.. యాంకర్ క్రిస్టెన్ వెల్కర్ దీనిపై మీరు చేస్తున్న ఈ రిగ్గింగ్ ఆరోపణలకు ఏవైనా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయా? అంటూ సూటిగా ప్రశ్నించారు. దీనికి ట్రంప్ బదులిస్తూ.. తాను స్వయంగా చూడటమే అతిపెద్ద ఆధారం అంటూ.. ప్రజలంతా ఇదే మాట్లాడుకుంటున్నారనీ, తాను వింటున్నాననీ సమాధానమిచ్చారు. కానీ అమెరికా ఎన్నికల వ్యవస్థలో రిగ్గింగ్ జరిగిందనడానికి ఎలాంటి అధికారిక ఆధారాలు లేవని, పదేపదే నిరూపించే బలమైన సాక్ష్యం చూపాలని క్రిస్టెన్ పట్టుబట్టారు. యాంకర్ పదే పదే ఆధారాలు అడగడంతో డొనాల్డ్ ట్రంప్ ఒక్కసారిగా సహనాన్ని కోల్పోయారు. లైవ్ లోనే ఆమెపై తీవ్ర స్వరంతో విరుచుకుపడుతూ వ్యక్తిగత దూషణలకు దిగారు. సీఎన్బీ చానెల్ సహా ఏబీసీ ), సీబీఎస్, సీఎన్ఎన్ వంటి సంస్థలపై కూడా ఆరోపణలు, విమర్శలూ గుప్పిస్తూ.. తన కాలర్ కు ఉన్న మైక్రోఫోన్ ను నేలపైకి విసిరికొట్టి షో మధ్యలోంచి వాకౌట్ చేశారు. డొనాల్డ్ ట్రంప్ జర్నలిస్టుల పట్ల, ముఖ్యంగా మహిళా రిపోర్టర్ల పట్ల దూషణాత్మక వైఖరి ప్రదర్శించడం ఇదే మొదటిసారి కాదు. కొద్ది రోజుల క్రితమే ఆయన సీఎన్ఎన్ రిపోర్టర్ కైట్లాన్ కాలిన్స్‌ను లక్ష్యంగా చేసుకుని, ఆమె కళ్లలో ఎప్పుడూ నాపై ద్వేషం కనిపిస్తుంది, ఆమె అస్సలు నవ్వదు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఎన్బీసీ లైవ్ షో లో యాంకర్ క్రిస్టెన్ వెల్కర్ను యూఆర్ క్రెకెడ్ అంటూ అవమానించారు. ట్రంప్ తీరుపై జర్నలిస్టులు, నెటిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/donald-trump-unruly-behavior-live-on-air-36-222195.html





