కాంగ్రెస్ గూటికి సునీత.. జగన్ కు ఇక దబిడిదిబిడే!
Publish Date:Jan 17, 2024
Advertisement
జగన్ కు మరో చెల్లెలు షాక్ ఇచ్చారు. సొంత చెల్లెలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ గూటికి చేరి ఇలా ఏపీ పగ్గాలు అందుకున్నారో లేదో, అలా మరో చెల్లెలు అంటే గొడ్డలి పోటుకు బలైపోయిన సొంత చిన్నాన్న కుమార్తె డాక్టర్ సునీత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అయిపోయారు. ఇప్పటి వరకూ తన తండ్రి హత్యకు సూత్రధారులు, పాత్ర ధారులకు శిక్ష పడాలని న్యాయపోరాటం చేస్తున్న వైఎస్ సునీత ఇప్పుడు న్యాయపోరాటంతో పాటు ప్రత్యక్ష రాజకీయాలలోకి అడుగుపెట్టి చట్ట సభల్లో కూడా గొంతెత్తాలని నిర్ణయించుకున్నారు. అన్నిటికీ మించి తన తండ్రి హంతకులకు రక్షణ కవచంలా నిలిచి కాపాడుతున్న పెద్దనాన్న వైఎస్ కుమారుడు, ఏపీ సీఎం జగన్ పై రాజకీయ పోరాటానికి రెడీ అయ్యారు. వైఎస్ వివేకా హత్య జరిగిన వెంటనే ఆరోపణలు గుప్పించిన వాళ్లే ఇప్పుడు నిందితులుగా, అనుమానితులుగా బోనులో నిలబడాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అప్పట్లో ఆరోపణలు ఎదుర్కొన్నవారికి ఆ కేసుతో ఏం సంబంధం లేదని విస్పష్టంగా తేలిపోయింది. అప్పట్లో నారాసుర రక్త చరిత్ర అంటూ ఆరోపణలు గుప్పించిన వారే ఇప్పుడు వివేకా హత్య కేసులో అభియోగాలను ఎదుర్కొంటున్నారు. నిందితులుగా ఉన్నారు. అసలు వివేకా హత్య కేసు దర్యాప్తు నత్తనడకకు కారణం ఎవరన్న దానిపై కూడా సందేహాలన్నీ నివృత్తి అయిపోయాయి. కారకులెవరు? హత్య లో పాత్రధారులు, సూత్రధారులు ఎవరు అన్న విషయం కోర్టులు ఇంకా తేల్చకపోయినా.. ప్రజలకు మాత్రం క్లారిటీ వచ్చేసింది. రాష్ట్రంలో అందరికీ వివేకా హత్య మోటో ఏమిటి? చేసిందెవరు? చేయించిందెవరు? అన్నవిషయంలో ఎలాంటి అనుమానాలు కానీ, సందేహాలు కానీ లేవు. అయితే అసలీ కేసు ఇంత వరకూ వచ్చి.. ఒక లాజికల్ ఎండ్ దిశగా సాగడానికి కారణం మాత్రం ఒకే ఒక్కరు. ఆమే హతుడు వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత. తన తండ్రి హంతకులు, వారి వెనుకనున్న ముసుగువీరుల సంగతి తేల్చాలంటూ డాక్టర్ సునీత చేసిన, చేస్తున్న న్యాయ పోరాటం ఫలితంగానే వివేకా హత్య కేసు దర్యాప్తు ఇంత వరకూ వచ్చింది. అలుపెరుగని షర్మిల పోరాట ఫలితమే నేడు వివేకా హత్య కేసు ఒక లాజికల్ ఎండ్ దిశగా సాగింది. ఒక మహిళగా, ఎవరి ఒత్తిళ్లకు లొంగకుండా, న్యాయం కోసం సునీత చేసిన, చేస్తున్న పోరాటం గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే జగన్ సర్కార్ వ్యవస్థలను మేనేజ్ చేయడం, నిర్వీర్యం చేయడం ద్వారా కేసు దర్యాప్తు వేగాన్ని మందగించేలా చేయడానికి చేయగలిగినంతా చేసింది. విపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ దర్యాప్తును డిమాండ్ చేసిన జగన్.. అధికారంలోకి రాగానే కేంద్రదర్యాప్తు సంస్థ అవసరం లేదన్నారు. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు.. కేసును నిర్వీర్యం చేయడానికి అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఎంతగా ప్రయత్నించిందన్న సంగతి. కేవలం సునీత న్యాయపోరాటం కారణంగానే కేసు సీబీఐ చేతికి వెళ్లి .. రాష్ట్రం దాటి తెలంగాణలో విచారణకు వచ్చింది. ఇక్కడా కేసులో తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం ఎంత వత్తాసుగా నిలిచింది. ఇందుకు అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు గైర్హాజరవ్వడాన్ని సమర్ధిస్తూ వీలైనప్పుడు వస్తారు? ఆయనేమైనా ఉగ్రవాదా? అంటూ మీడియా ముఖంగా ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల మాటలే నిదర్శనం. సరే అవన్నీ ఒకెత్తయితే ఇప్పుడు డాక్టర్ సునీత కాంగ్రెస్ గూటికి చేరనుండటం మరొక ఎత్తు. తండ్రి తమ్ముడిని, స్వయంగా తన సొంత బాబాయ్ని హత్య చేసిన వారిని సీఎం హోదాలో ఉన్న జగన్ కాపాడుతున్నారని తన న్యాయపోరాటం ద్వారా ఇప్పటికే ప్రజలకు తెలిసేలా చేసిన డాక్టర్ సునీత.. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాలలో అడుగు పెట్టడం ద్వారా బహిరంగ వేదికలపై జగన్ ప్రభుత్వ అకృత్యాలను, తన తండ్రి హంతకులను ఎలా కాపాడుతున్నారు వంటి అంశాలన్నిటినీ వివరించనున్నారు. జగన్ సొంత చెల్లెలు సొంత అన్న జగన్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో చేరి అన్నపై రాజకీయ పోరాటం ప్రారంభించేందుకు రెడీ అయిన సమయంలో ఆమెకు మద్దతుగా మరో చెల్లెలు, డాక్టర్ సునీత కాంగ్రెస్ గూటికి చేరనుండటం రాజకీయంగా చక్రం తిప్ప బోతున్న సమయంలో సునీత కూడా కాంగ్రెస్ లో జాయిన్ అవ్వాలనుకోవడం రాజకీవర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది.
http://www.teluguone.com/news/content/doctor-sunita-to-join-congress-39-168895.html





