ఏపీకి బడ్జెట్ అవసరమా?.
Publish Date:Mar 11, 2022
Advertisement
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి గురించి ప్రత్యేకించి చెప్పవలసింది, చెప్పుకోవలసింది ఏదీ లేదు. ఏమీ ఉండదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ‘ఆర్థిక క్రమ శిక్షణ’ అనే పదాన్ని రాష్ట్ర ఆర్థిక నిఘంటువు నుంచి తీసేసింది. అధికారంలోకి వస్తూనే, ఆ పదాన్ని పూర్తిగా ఏ మాత్రం ఆనవాలు లేకుండా తుడిచేసింది. ఇక అక్కడి నుంచి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పట్టాలు తప్పి ప్రయాణం సాగిస్తోంది. అప్పుల బాటలో పరుగులు తీస్తోంది. ఆదాయానికి మించి అప్పులు చేయడం తప్పనే ఆలోచన కూడా దగ్గరకు రానీయకుండా జగన్ రెడ్డి ప్రభుత్వం దొరికిన కాడికి, దొరికిన చోట నుంచి అప్పులు తెచ్చింది. చివరకు ఇక అప్పులు పుట్టని స్థితికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన, అసెంబ్లీలో అవును అప్పులు చేశాం, అప్పులు చేస్తాం, అప్పులు చేయకుండా బండి నడవదు, సంక్షేమ పథాకాలు అమలు చేయలేము, అని కుండ బద్దలు కొట్టారు. అంతే కాదు, పార్లమెంట్’లో వైసీపీ ఎంపీలు కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉద్యోగుల జీతాలు కూడా ఇచ్చుకోలేని దయనీయ స్థితిలో ఉందని దేశం అంతా వినిపించేలా వైసీపీ ఎంపీలు పార్లమెంట్’లో రాగయుక్తంగా వి(ల)నిపించారు. కేంద్రం ముందు చేతులు చాచారు. అయితే, మంత్రులు, ఎంపీలే కాదు, స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీలో, ఆంధ్ర ప్రదేశ్ అప్పుల కుప్పగా మారిందనే విపక్షాల విమర్శలపై స్పందించారు, కానీ, తమ ప్రభుత్వం చేసిన అప్పుల పద్దును పక్కన పెట్టి గత ప్రభుత్వ హయాంలో చేసిన అప్పుల చిట్టాను బయట పెట్టారు. నిజానికి, వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, తెలుగు దేశం ప్రభుత్వం తెగ అప్పులు చేస్తోందని, రాష్ట్రాన్ని అప్పులు ఊబిలోకి తీసుకు పోతోందని ఆరోపించిందికానీ,అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పులు మీద ప్పులు చేస్తూ పోతోంది. ఎఫ్ఆర్’బీఎం వార్షిక పరిమితి ఆరు నెలలలోనే జగన్ సర్కార్ దాటేసింది. అంచనాలను మించి అదనంగా 153 శాతం అధికంగా ఏపీ అప్పులు ఉన్నాయని కాగ్ గత డిసెంబర్’లో (?) తేల్చి చెప్పింది. ఈ నేపద్యంలో, అసలు ఏపీకి బడ్జెట్ అవసరమా అనే ప్రశ్నకు,అవసరం లేదనే సమాధానమే వస్తోంది. ఎందుకంటే బడ్జెట్‌లో లేని ప్రతిపాదనలకు రూ.వేల కోట్లు ఇప్పటివరకు ప్రభుత్వం ఖర్చుపెట్టింది. ఇలాంటప్పుడు రాష్ట్ర బడ్జెట్ తయారు చేసి దానికి శాసనసభ ఆమోదం తీసుకోవడం ఎందుకన్నది అర్థం కావడం లేదు. సాక్షాత్తూ కాగ్ ఈ వాస్తవాలను బయటపెట్టింది. నిజానికి, బడ్జెట్’కు ఒకప్పుడు ఉన్న ‘పవిత్రత’ ప్రాధాన్యత ఇప్పుడు లేవు. అసెంబ్లీ, పార్లమెంట్ సమావేశాల్లాగా అదొక ఒక మొగ్గుబడి తంతుగా మారిపోయింది. ఒకప్పుడు సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టక ముందు, అందులోంచి ఒక అక్షరం, ఒక అంకె బయటకు వచ్చినా పరిణామాలు చాలా తీవ్రంగా ఉండేవి. ఒకనొక సందర్భంలో, బడ్జెట్ లీక్ చేశారనే ఆరోపణపై ఒక సీనియర్ జర్నలిస్టు’కు సంవత్సరం పాటో ఏమో నగర బహిష్కరణ శిక్ష విధించారు. ఇప్పుడు బడ్జెట్. విశేషాలు చాలావరకు ముందుగానే పత్రికల్లో వస్తున్నాయి. అలాగే, రోశయ్య గారు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు, శాసన సభలో బడ్జెట్’లో కేటాయింపు లేకుండా దేనికీ ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం ఖర్చు చేయడం కుదరదని, బడ్జెట్’ లో ఒక్క రూపాయి కేటాయింపు ఉన్నా, ఎంతకైనా పెంచుకోవచ్చని (రివైజ్ చేసుకోవచ్చని) చెప్పారు. కానీ, కాగ్ అధికారికంగా ప్రకటించిన లెక్కల ప్రకారమే, జగన్ రెడ్డి ప్రభుత్వ ఎలాంటి బడ్జెట్ అనుమతి లేకుండానే దాదాపు 124 అంశాల్లో 94 వేల 399.04 కోట్లను వివిధ ప్రభుత్వ శాఖలకు ఖర్చు చేసినట్లు కాగ్ గుర్తించింది.అంటే, బడ్జెట్’కు జగన్ రెడ్డి ప్రభుత్వం ఎంత గౌరవం ఇస్తోందో వేరే చెప్పనక్కరలేదు. చివరగా, యాదృచ్చికమే కావచ్చును, కానీ, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టాడానికి 24 గంటల ముందు, మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే, ఆనం రాంనారాయణరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి, సుదీర్ఘ కాలం ఆర్థిక శాఖను నిర్వహించిన రోశయ్య గారి గురించి ఒక మంచి విషయం గుర్తు చేశారు. అసెంబ్లీలో రోశయ్య మృతికి సంతాపం తెలియచేస్తూ, “రోశయ్య ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడూ ఓవర్ డ్రాఫ్ట్‌లకు వెళ్లలేదు. ఏడుసార్లు ఆర్థిక మంత్రిగా పని చేసినా.. ఒక్కసారి కూడా తాత్కాలిక అప్పులకు వెళ్లలేదు.ఒక్కసారి కూడా ఓవర్ డ్రాఫ్‌్సల కోసం వెళ్లిన దాఖలాలు లేవన్నారు. అప్పుడు ఓడీలు ప్రభుత్వ విధానంలో భాగమైనా వాటిని తీసుకోవడానికి రోశయ్య అంగీకరించలేదు” అని గుర్తు చేశారు.అలాగే, ‘అప్పులు చేయడానికి నేను సిద్ధంగా లేనని ఆయన చాలా కచ్చితంగా చెప్పేవారని’ వివరించారు. అలాగని రోశయ్య హయాంలో ప్రభుత్వాలు అసలు అప్పులే చేయలేదా అంటే చేశాయి, కానీ, ఓటు బ్యాంక్ పథకాల కోసం అప్పులు చేయలేదు.
http://www.teluguone.com/news/content/do-budget-lost-its-sanctity-39-132880.html





