సెలవులో ఉన్న సీఎస్ పేరు మీద జీవో.. టీఆర్ఎస్ ఆఫీసుకు భూ కేటాయింపు వివాదం!
Publish Date:May 12, 2022
Advertisement
టీఆర్ఎస్ కార్యాలయానికి భూ కేటాయింపు జీవో కొత్త వివాదానికి తెరలేపింది. అసలే ప్రైమ్ ల్యాండ్ లో టీఆర్ ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా కేంద్రానికి వంద కోట్ల రూపాయల విలువ చేసే భూమిని ప్రభుత్వం ధారాదత్తం చేయడంపై సర్వత్రా నిరసనలు భగ్గు మంటుంటే.. ఆ జీవో జారీ చేసిన రోజు అంటే బుధవారం సీఎస్ సోమేష్ కుమార్ సెలవులో ఉన్నారు. ఆయన సెలవులో ఉన్న రోజు ఆయన పేరు మీద జీవో విడుదల కావడం వివాదాస్పదమైంది. ఇలా దొంగ జీవోతో అధకార పార్టీకి విలువైన భూమిని కట్టబెట్టడం అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని కాంగ్రెస్ అభివర్ణిస్తున్నది. ఇప్పటికే టీఆర్ఎస్ ఎంపీలు, నాయకులు పలువురు ప్రభుత్వ భూమిని అతి తక్కువ ధరకు సొంతం చేసుకున్నారనీ, ఇప్పుడు నగరంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతంలో అదీ తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర కార్యాలయానికి అతి చేరువలో దాదాపు ఎకరం భూమిని పార్టీ జిల్లా కార్యాలయానికి టీఆర్ఎస్ ప్రభుత్వం దొడ్డిదారి జీవోద్వారా అప్పనంగా దోచి పెట్టిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. టీఆర్ఎస్ భవన్‌కు దగ్గరలోనే మళ్లీ అదే పార్టీకి ఎకరాకు పైగా భూమి కేటాయించడం వెనుక మతలబేమిటని ప్రశ్నిస్తోంది. అదీ సీఎస్ సెలవులో ఉండగా.. ఆయన పేరు మీద జీవో విడుదల చేసి మరీ భూమిని ధారాదత్తం చేయడం వెనుక రహస్యం ఏమిటని నిలదీస్తోంది.
http://www.teluguone.com/news/content/dispute-on-land-allottment-go-issued-in-the-name-of-cs-whe-he-is-on-leave-25-135792.html





