అఖిలపక్షం ఐడియా బెడిసికొట్టిందా
Publish Date:Nov 4, 2013
Advertisement
రాష్ట్ర విభజనపై చర్చించడానికి కేంద్రం ఈ నెల 12,13 తేదీలను ముహూర్తంగా నిశ్చయించింది. మొదటి రోజు నాలుగు పార్టీలతో రెండో రోజు మిగిలిన నాలుగు పార్టీలతో సమావేశమవ్వాలని నిశ్చయించుకొంది. అయితే రాష్ట్రంలో అన్ని పార్టీలు ఈ దశలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటుని తీవ్రంగా విమర్శిస్తుండటంతో, ఈ ఐడియాతో ప్రతిపక్షాలను ఇరికించాలని చూసిన కాంగ్రెస్ స్వయంగా ఇరుక్కొంది. వైకాపా, సీపీఎం, తెరాస, తెదేపాలే కాదు చివరికి మజ్లిస్ పార్టీ సైతం అఖిలపక్ష సమావేశానికి హాజరు కావడానికి నిరాసక్తత చూపడం గమనార్హం. ఒక తెదేపా,వైకాపాలు తప్ప అందరు ఎగురుకొంటూ వచ్చేస్తారని భావించిన కాంగ్రెస్ పార్టీకి తెరాస సైతం తీవ్ర విమర్శలు చేయడంతో వాటికి జవాబు చెప్పకతప్పని పరిస్థితి ఏర్పడింది. అందుకే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ “కేసీఆర్ కేంద్ర మంత్రుల బృందానికి తమ పార్టీ తరపున సలహాలు ఈయవచ్చును. కానీ అనవసరమయిన వ్యాఖ్యలు మానుకొంటే మంచిది,” అని ఘాటుగా జవాబిచ్చారు. అదేవిధంగా ఆయన తెదేపాను విమర్శిస్తూ “ఒక్కపుదు అఖిలపక్షం సమావేశం పెట్టమని గట్టిగా డిమాండ్ చేసిన ఆ పార్టీ ఈవిషయంలో కూడా ‘యూ టర్న్’ తీసుకోవడం విచారకరం,” అని అన్నారు. రాష్ట్రంలో పార్టీలు ఏవిధంగా వ్యవహరించినప్పటికీ, రెండు ప్రాంతాల ప్రజల మధ్య విభేదాలు, దూరం తగ్గించవలసిన బాధ్యత తమపై ఉందని ఆయన చెప్పడం విశేషం. రాష్ట్ర విభజన చేసి తెలుగు ప్రజల మధ్య కాంగ్రెస్ పార్టీ చిచ్చుపెట్టిందని ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నఆరోపణల కారణంగానే బహుశః ఆయన ఈవిధంగా స్పందించి ఉండవచ్చును. ఏమయినప్పటికీ, రాష్ట్ర విభజ చేయాలని నిర్ణయం తీసుకొన్న తరువాత, ఇప్పుడు అఖిలపక్ష సమావేశానికి ప్రతిపక్ష పార్టీలను పిలవడం కేవలం కంటి తుడుపు చర్య మాత్రమే కాదు, తన తప్పుల తడకల విభజన ప్రక్రియను విమర్శిస్తున్న వారిని కూడా ఇందులో ఇరికించాలనే దురాలోచన కూడా చాలా ఉంది.
http://www.teluguone.com/news/content/digvijay-singh-39-27121.html





