జగన్ ‘నేను’.. చంద్రబాబు ‘మనం’
Publish Date:Mar 6, 2025
Advertisement
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సమష్టి తత్వంతో ముందుకు సాగుతారు. అందరినీ కలుపుకుపోతే విజయాలు వాటంతట అవే వస్తాయని నమ్ముతారు. కలిసుందాం రా అంటూ అదరినీ కలుపుకుపోతారు చంద్రబాబు. ఏ విషయంలోనూ దాపరికం ఉండదు. పూర్తి పారదర్శకతతో వ్యవహరిస్తారు. ఇదే ఆయనను నాలుగున్నర దశాబ్దాలుగా దేశ రాజకీయాలలోనే ఒక ఆదర్శవంతమైన నేతగా నిలుపుతూ వస్తున్నది. ఎన్నికలలో జయాపజయాలతో సంబంధం లేకుండా విలువలతో కూడిన రాజకీయాలను నెరపడంలో ఆయనకు ఆయనే సాటి. అయితే గత ఐదేళ్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రగతిని అధోగతి పాలు చేసిన జగన్ వ్యవహార శైలి అందుకు పూర్తి భిన్నం. అన్ని విషయాలలోనూ ఆయన ఏక్ నిరంజన్ అన్నట్లుగానే వ్యవహరిస్తారు. అందుకే ఒక్క విజయంతో విర్రవీగిపోయిన జగన్.. ఒక్క పరాజయంతోనే పతనానికి చేరుకున్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు, విభజన కష్టాలలో నిండా మునిగి ఉన్న ఆంధ్రప్రదేశ్ ను ఐదేళ్లలోనే అభివృద్ధి నమూనాగా నిలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వరుసగా నాలుగేళ్ల పాటు రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపారు. ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతి నిర్మాణాన్ని పరుగులెత్తించి ప్రపంచం మొత్తం ఏపీవైపు చూసేలా చేయగలిగారు. 2014 నుంచి 2019 విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాష్ట్రాన్ని ప్రగతి పథంలో పరుగులు పెట్టించారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి వంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పనులు చేయించారు. ప్రతి సోమవారంను పోలవారంగా ప్రకటించి వరుస సమీక్షలతో పోలవరం ప్రాజెక్టు పనులు 70 శాతం పైగా పూర్తి చేయించారు. ఇక కేంద్రంతో తరచూ భేటీ అవుతూ రాష్ట్ర ప్రయోజనాల కోసం చర్చలు జరిపారు. ఆ చర్చలన్నీ పారదర్శకంగా ఉండేవి. ప్రధాని మోడీలో భేటీకి ఆయన ఒంటరిగా కాకుండా మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి వెళ్లే వారు. చర్చించిన అంశాలు, దాని ఫలితం అన్నిటినీ మీడియాకు వెల్లడించేవారు. సరే 2019లో అధికార పగ్గాలు చేపట్టిన జగన్ మాత్రం ఎక్ నిరంజన్ అన్నట్లుగా వ్యవహరించారు. ఆయన హయాంలో ఆంధ్రప్రదేశ్ ప్రగతి పురోగమించడం అటుంచి తిరోగమనంలో సాగింది. ఆయన హస్తిన పర్యటనలన్నీ రహస్యోద్యమాలే. ఆయన కేంద్రం పెద్దలతో భేటీకి ఒంటరి యాత్రలే చేసేవారు. ఆ భేటీల్లో చర్చించిన అంశాలేమిటి? ఫలితం ఏమిటి వంటి విషయాలను ఆయన మీడియాకు వెల్లడించిన సందర్భమే లేదు. తరువాత ఎప్పుడో తాపీగా ఒక ప్రెస్ నోట్ మాత్రం విడుదలయ్యేది. అంతే.. ఇప్పుడు తాజాగా చంద్రబాబు హస్తిన పర్యటనలో కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహించారు. ఆ భేటీలకు ఆయన కూటమి ఎమ్మెల్యేలను వెంట తీసుకుని వెళ్లారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విత్త మంత్రి నిర్మలా సీతారామన్, రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో చంద్రబాబు జరిపిన వరుస భేటీలలో ఆయనతో పాటు కూటమి పార్టీలకు చెందిన నేతలు ఉన్నారు. కేంద్ర మంత్రులతో చర్చించిన అంశాలేమిటి? వాటిపై కేంద్ర మంత్రుల స్పందన ఏమిటి? అన్న విషయాలన్నిటినీ చంద్రబాబు మీడియాకు వివరించారు. అదే జగన్ విషయానికి వస్తే సీఎంగా ఆయన పలుమార్లు హస్తిన పర్యటించారు. కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. కానీ ఏ భేటీలోనూ ఆయన వెంట అప్పట్లో వైసీపీ నేతలు కానీ, ఎంపీలు కానీ లేరు. ఆఖరికి అప్పట్లో ఆయనకు అత్యంత విశ్వాసపాత్రుడైన విజయసాయిరెడ్డి కూడా ఉండేవారు కాదు. జగన్ వెంట వారంతా మంత్రుల నివాసాల వరకూ మాత్రమే తమ అధినేత వెంట ఉండటానికి అవకాశం ఉండేది. లోపలికి మాత్రం జగన్ ఏక్ నిరంజన్ అన్నట్లుగా ఒక్కేడే వెళ్లే వారు. అక్కడ ఆయన చర్చించిన అంశాలేమిటి? అన్నది బ్రహ్మ రహస్యంగానే ఉండేవి. ఇదీ చంద్రబాబుకు, జగన్ కు ఉన్న తేడా. జగన్ ‘నేను’ అన్న అహంతో వ్యవహరించేవారు. చంద్రబాబు మాత్రం ‘మనం’ అన్న సమష్టితత్వాన్ని చాటారు, చాటుతున్నారు.
http://www.teluguone.com/news/content/difference-between-cbn-and-jagan-25-193961.html





