నోట్ల రద్దు వైద్యం వికటించిందా? సైడ్ ఎఫెక్ట్స్ మాత్రమేనా?
Publish Date:Nov 18, 2016
Advertisement
డామిట్ ... కథ అడ్డం తిరిగింది! అసలీ పెద్ద నోట్ల రద్దు మంచిదేనా? కాదా? ఖచ్చితంగా మంచిదే! కాని, ఈ అద్భుతమైన సక్సెస్ ఫుల్ ఆపరేషన్ ... పేషంట్ డెడ్ అనేలా జరుగుతుందేమో మోదీగారూ! అదీ అసలు సమస్య...
నోట్ల రద్దుతో భారీగా బ్లాక్ మనీ వెలికి వస్తుంది. మార్కెట్లో అన్ని ధరలు అందుబాటులోకి వస్తాయి. ఇవన్నీ మోదీ భక్తులు చెబుతోన్న లాభాలు. కాని, వాళ్లు చెప్పలేకపోతున్న సత్యాలు బయట మార్కెట్లో వున్నాయి. ఏటీఎంలు, బ్యాంక్ ల వద్ద క్యూ లైన్ల గురించి కాదు మనం మాట్లాడేది. అసలు ఒక్కసారి ఆలోచించారా... డెబిట్ కార్డు, బ్యాంక్ అకౌంట్ లేని అత్యంత పేదల సంగతేంటి? నోట్ల రద్దుతో నోట్లోకి ముద్ద దిగటం కష్టం అవుతోంది వాళ్లకి! వాళ్ల తరువాత నానా యాతన పడుతోంది మధ్య తరగతి వారు. వీళ్లనే మనం క్యూ లైన్లలో చూస్తున్నాం. ఇక అసలు నల్లదనం పోగేసిన నల్ల నక్కలు మాత్రం హాయిగా ఎప్పటిలాగే ఏసీ రూముల్లో, కార్లలో లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. మహా అయితే పాత నోట్లు ఏం చేయాలా అని తలగొక్కుంటూ ఆలోచిస్తున్నారు. అంతే తప్ప బతుకు బస్టాండ్ అయింది మాత్రం మామూలోడికే!
మోదీ, ఆయన చుట్టూ మూగిన మేధావులు ఎందుకోగాని మిస్సైపోయిన లాజిక్ వంద నోట్ల కొరత! దేశంలో ఒక్క అయిదు వందల నోటు చెలామణి లోంచి పోతే అయిదు వేరు వేరు వంద నోట్లు అవసరం అవుతాయి. అలాగే, ఒక్క వెయ్యి పోతే పది వంద నోట్లు కావాలి. కాని, అన్ని అయిదేసి, పదేసి వందలు వున్నాయా? లేవు. 85శాతం పెద్ద నోట్లే. కేవలం 15శాతమే వంద, యాభై, పది నోట్లు. అంటే, ఇప్పుడు నోట్ల రద్దు తరువాత దేశం కేవలం 15శాతం డబ్బుతోనే నడుస్తోందన్నమాట! ఇక రెండు వేల నోటు... మరో కొత్త టెన్షన్ లా వుంది! అది అటు ఏటీఎంలో పట్టదట... ఇటు చిల్లర అడుగుతూ షాపుకు వెళ్లితే గిట్టదట! దాన్ని ఏం చేస్తాడు సామాన్యుడు? చూసి మురవటం తప్ప!
నోట్ల రద్దు అనేది వైద్యం కావొచ్చు. కాని, పరిస్థితి చూస్తుంటే... రోగానికి కారణమైన నల్ల మారాజులతో పాటూ అందరికీ సమానంగా కషాయం తాగించినట్టు వుంది! దాంతో రోగమూ, రోగ నిరోధక శక్తి రెండూ పోయేలా వున్నాయి! మరి మోదీ జీ అంతిమంగా ఏం చేస్తారో లెట్స్ వెయిట్ అండ్ సీ! సామాన్యుడి జీవితం తొందరగా కుదుటపడటమే ఇప్పుడు అందరికీ కావాల్సింది!
http://www.teluguone.com/news/content/demonetisation-45-69229.html





