ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో.. ఉద్యోగులకు డెల్ ట్రావెల్ అడ్వైజరీ
Publish Date:Apr 6, 2026
Advertisement
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రముఖ అంతర్జాతీయ టెక్ సంస్థ డెల్ తన ఉద్యోగులకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అమెరికాకు చెందిన పలు ఆర్థిక, సాంకేతిక సంస్థలను తమ లక్ష్యాలుగా ప్రకటించిన నేపథ్యంలో డెల్ ఈ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ మధ్య వరకు మధ్యప్రాచ్య దేశాలకు ఎటువంటి పని నిమిత్తం ప్రయాణాలు చేయవద్దని కంపెనీ తన సిబ్బందిని కోరింది. ఇటీవల ఇరాన్ ప్రభుత్వం దాదాపు 18 అమెరికన్ కంపెనీలను ఉగ్రవాద సంస్థలుగా పేర్కొంటూ విడుదల చేసిన జాబితాలో డెల్‌తో పాటు మెటా, టెస్లా, బోయింగ్, ఇంటెల్ వంటి దిగ్గజ సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలు అమెరికా, ఇజ్రాయెల్‌కు గూఢచారి సంస్థలుగా వ్యవహరిస్తున్నాయని, ఇరాన్ నాయకులపై దాడులకు సహకరిస్తున్నాయని ఐఆర్‌జీసీ ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే తమ ప్రాంతంలోని ఈ కంపెనీల కార్యాలయాలపై దాడులుచేస్తామని హెచ్చరించింది. ఇప్పటికే అమెజాన్, ఒరాకిల్ వంటి దిగ్గజ సంస్థలపై దాడులకు పాల్పడింది. ఈ నేపథ్యంలోనే డెల్ తన అంతర్గత సమాచార వ్యవస్థ ద్వారా ఉద్యోగులకు పంపిన సందేశంలో భద్రతకే తాము ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేసింది. ఇజ్రాయెల్, లెబనాన్ వంటి దేశాలతో పాటు బహ్రెయిన్, జోర్డాన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా మరియు యూఏఈ వంటి గల్ఫ్ దేశాలకు ప్రయాణించవద్దని ఆ అడ్వైజరీలో పేర్కొంది. నేరుగా వెళ్లడమే కాకుండా, ఈ దేశాల మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లే విమాన ప్రయాణాలను కూడా నివారించాలని ఆదేశించింది. ప్రస్తుతం ఆయా దేశాల్లో పనిచేస్తున్న డెల్ ఉద్యోగులు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు వర్క్ ఫ్రం హోం పని చేయాలని పేర్కొంది. భౌతిక దాడులతో పాటు సైబర్ దాడులు కూడా జరిగే అవకాశం ఉన్నందున, కంపెనీకి చెందిన సెక్యూరిటీ అండ్ రెసిలియెన్సీ ఆపరేషన్స్ బృందం నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తోందని పేర్కొంది. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఉద్యోగులకు మానసిక ధైర్యాన్ని అందించేందుకు కౌన్సెలింగ్ సేవలను కూడా అందుబాటులోకి తెచ్చింది.
http://www.teluguone.com/news/content/dell-travel-advisory-to-its-employees-in-gulf-nations-36-216745.html





