తెరమీద ఆయన చూపిన బొమ్మ.. భారతీయ సినిమాకు ప్రాణం పోసింది..!
Publish Date:Feb 15, 2025
Advertisement
దుండిరాజ్.. దాదాసాహెబ్.. దాదాసాహెబ్ ఫాల్కేగా ప్రసిద్ధి చెందిన ఈయన అసలు పేరు ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే. ఏప్రిల్ 30, 1870న మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్‌లో జన్మించారు. ఆయనకు చిన్నప్పటి నుంచీ కళలపై ఆసక్తి ఉండేది. ఈయన చాలా కళలు అభ్యసించారు. విద్య పూర్తి చేసిన తర్వాత ఫోటోగ్రాఫర్ గానూ, డ్రాఫ్ట్స్‌మన్‌గా పనిచేయడం ప్రారంభించారు. తరువాత ఫాల్కే ప్రింటింగ్ వ్యాపారంలోకి అడుగుపెట్టి బొంబాయిలో తన సొంత ప్రింటింగ్ ప్రెస్‌ను స్థాపించారు. ఈ అనుభవం ఆయన భవిష్యత్ చిత్రనిర్మాణ వృత్తిని రూపొందించడంలో కీలక పాత్ర పోషించింది. 1911లో ఫాల్కే "ది లైఫ్ ఆఫ్ క్రైస్ట్" అనే మూకీ చిత్రాన్ని చూశారు. ఇది ఆయన జీవితాన్ని మార్చేసింది. చిత్రకళతో ఆయనకు సంబంధం దీని వల్లనే ఏర్పడింది. ఆ చిత్రం ఆయనపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. చిత్రనిర్మాణంపై ఆయన మక్కువను రేకెత్తించింది. ఈ ఆకర్షణ, ఈ ఆసక్తితోనే ఆయన చిత్రనిర్మాణంలోకి ప్రవేశించాలని అనుకున్నారు. అయితే ఆ సమయంలో భారతదేశంలో చిత్రనిర్మాణానికి సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు లేవు. అయినా సరే నిరుత్సాహపడకుండా ఫాల్కే చిత్రనిర్మాణ పద్ధతులు, పరికరాల గురించి మరింత తెలుసుకోవడానికి లండన్‌కు వెళ్లారు. ఆయన సంపాదించిన జ్ఞానం, చిత్రనిర్మాణంపై ఆయనకున్న దృఢ సంకల్పంతో దేశంలో చలనచిత్ర నిర్మాణాన్ని స్థాపించాలనే లక్ష్యంతో భారతదేశానికి తిరిగి వచ్చారు. భారతదేశంలో సవాళ్లు.. 1920, 1930లలో దాదాసాహెబ్ ఫాల్కే ఆర్థికంగానూ, సాంకేతికంగానూ చాలా సవాళ్లను ఎదుర్కొన్నారు. అయితే ఈ అడ్డంకులు ఆయనను చిత్రనిర్మాణంపై తనకున్న మక్కువను ఆపలేకపోయాయి. ఫాల్కే 1913లో విడుదలైన భారతదేశపు మొట్టమొదటి పూర్తి నిడివి చలనచిత్రం " రాజా హరిశ్చంద్ర "తో సహా అనేక విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించి నిర్మించారు. ఈ సంచలనాత్మక చిత్రం భారతీయ సినిమా ప్రారంభానికి నాంది పలికింది. భవిష్యత్ చిత్రనిర్మాతలు వారిలో ఉన్న సృజనాత్మకత వెలికితీయడానికి పునాది వేసింది. మరణం.. వారసత్వం.. దాదా సాహెబ్ ఫాల్కే ఫిబ్రవరి 16, 1944న మరణించారు. ఆయన ఒక అద్భుతమైన వారసత్వాన్ని భారతదేశానికి అందించారు. భారతీయ సినిమాకు ఆయన చేసిన కృషి గుర్తుగా నేటికీ ఆయన మరణాన్ని, జయంతిని ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు. ఆయన గౌరవార్థం భారత ప్రభుత్వం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు స్థాపించింది. భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని వ్యక్తులకు వారి అత్యుత్తమ సేవలకు ఇచ్చే అత్యున్నత గౌరవాలలో ఇది ఒకటి. ఫాల్కే మార్గదర్శక ప్రయత్నాలు భారతీయ చలనచిత్ర పరిశ్రమను స్థాపించడమే కాకుండా భారతీయ సాంస్కృతికతను, భారతీయ విలువలను ప్రజలకు తెలిజేయడంలో సహాయపడ్డాయి. ఇప్పటికాలంలో సినిమా అనేది చాలా శక్తివంతమైన సాధనంగా మారడం వెనుక దాదాసాహెబ్ కృషి, ఆయన వేసిన మొదటి అడుగు ఉన్నాయి. భారతీయ విలువలను పరిరక్షించడానికి, ప్రోత్సహించడానికి సహాయపడే భారతీయ పురాణాలు, ఇతిహాసాలు, కథలను ఆయన సినిమాలుగా రూపొందించారు. అంతిమంగా.. ప్రింటింగ్ ప్రెస్ యజమాని నుండి భారతీయ సినిమా పితామహుడిగా మారే వరకు దాదాసాహెబ్ ఫాల్కే ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకం. ఆయన అంకితభావం, అభిరుచి, దార్శనికత నేడు మనకు తెలిసిన భారతీయ చిత్ర పరిశ్రమకు పునాది వేసింది. తెర మీద ఆయన చూపిన బొమ్మ దాదాసాహెబ్ చేసిన మ్యాజిక్కే..!
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్.. చాలా మంది నటుల కల ఇది. భారతీయ చలనచిత్ర పితామహుడిగా పిలువబడే దాదాసాహెబ్ ఫాల్కే గుర్తుగా, ఆయన గౌరవార్థం ఈ అవార్డును ఎంపిక చేసిన నటులకు ఇస్తుంటారు. చలనచిత్ర పరిశ్రమలో దాదాసాహెబ్ తిరుగులేని వ్యక్తి. ఆయన భారతీయ సినిమాను విప్లవాత్మకంగా మార్చారు. భవిష్యత్ చిత్రనిర్మాతలకు సృజనాత్మక నైపుణ్యాన్ని అందివ్వడంలోనూ, చలనచిత్ర రంగాన్ని అబివృద్ది చేయడానికి తగిన అణ్వేషనలు జరపడంలోనూ ఈయన వేసిన మొదటి అడుగే తదుపరి వారికి మార్గం చూపింది. ఫిబ్రవరి 16 వ తేదీన దాదాసాహెబ్ ఫాల్కే మరణించారు. ఈ సందర్బంగా ఆయన గురించి చాలామందికి తెలియని విషయాలు, విశేషాలు తెలుసుకుంటే..
ఆసక్తికర ప్రయాణం..
*రూపశ్రీ.
http://www.teluguone.com/news/content/dadasaheb-phalke-special-story-35-192948.html





