ఎల్ నినో ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాలలో సాగుకు తిలోదకాలేనా?
Publish Date:Jul 25, 2026
Advertisement
ఎల్ నినో ఎఫెక్ట్ తో తెలుగు రాష్ట్రాలలో కరవు పరిస్థితులు నెలకొన్నాయి. నైరుతి రుతుపవనాలు ముఖం చాటేయడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా సాగు, తాగునీటికి తీవ్ర కొరత ఏర్పడే పరిస్థితులు ఏర్పడ్డాయి. నెలకొన్నాయి. వానకాలం ఖరీఫ్ సీజన్ సగం గడుస్తున్నప్పటికీ వర్షభావ పరిస్థితుల కారణంగా సాగు రంగం సంక్షోభంలో పడింది. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ సారికి క్రాప్ హాలీడే యే శరణ్యమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాభావం కారణంగా ఈ సీజన్ సాగుకు తిలోదకాలు వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు. పలు గ్రామీణ మండలాల్లో నేల కనీసం ఒక్కసారి కూడా తడవని పరిస్థితి ఏర్పడింది. ఈ అనావృష్టి ప్రభావం పంట సాగుపైనే కాకుండా తాగునీటి నిల్వలపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. తెలంగాణలో పరిస్థితి మరీ దయనీయంగా మారింది. సాధారణ వర్షపాతం 35 శాతానికి పైగా లోటు నమోదైంది. రాష్ట్రంలోని పాతిక పైగా జిల్లాలలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాల్లో పరిస్థితి మరీ దారుణంగా మారింది. ప్రధాన జలాశయాల్లో నీటి మట్టాలు కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. దీంతో వ్యవసాయానికి నీటిని విడుదల చేయడం నిలిపివేసి, ఉన్న కొద్దిపాటి జలాలను తాగునీటి అవసరాలకే కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ దాదాపు అదే పరిస్థితి. రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లోని 400కి పైగా మండలాల్లో నేలలో తేమ శాతం పడిపోయింది. అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో వర్షాధారంగా సాగయ్యే వేరుశనగ, పత్తి, పప్పుధాన్యాలు, మిర్చి పంటలు నీరు లేక ఎండిపోతున్నాయి. వర్షాలు లేక విత్తనాలు వేయడం ఆలస్యం కావడం, నాటిన మొలకలు ఎండిపోతుండటంతో చిన్న, కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి. కేవలం గ్రామీణ ప్రాంతాలే కాకుండా ప్రధాన నగరాలు కూడా నీటి కొరత ముప్పును ఎదుర్కొంటున్నాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి మహానగరాల్లో తాగునీటి సరఫరా వ్యవస్థలపై ఒత్తిడి పెరుగుతోంది. జలాశయాల్లో నీటి నిల్వలు రోజురోజుకూ తగ్గిపోతుండటంతో నగరపాలక సంస్థలు ముందస్తు చర్యలకు ఉపక్రమిస్తున్నాయి. అత్యవసర సమయంలో నీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండటం కోసం ట్యాంకర్లను సిద్ధం చేయడం, అందుబాటులో ఉన్న నీటి వనరులను నిశితంగా పర్యవేక్షించడంపై అధికారులు దృష్టి సారించారు. వాతావరణ శాఖ వివరాల ప్రకారం, పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్ నినో ప్రభావం వల్ల రుతుపవనాల గమనం మందగించింది. అల్పపీడన ద్రోణులు మధ్య, పశ్చిమ భారత ప్రాంతాల వైపు తరలిపోవడంతో తెలుగు రాష్ట్రాలలో వానలు కురవడం లేదు. జులై చివరి వారంలో లేదా ఆగస్టు ప్రారంభంలో బంగాళాఖాతంలో ఏర్పడే స్థానిక వాతావరణ మార్పుల వల్ల కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. Kharif Cultivation Crisis, Water Scarcity in Telugu States, Absence, Southwest Monsoon
http://www.teluguone.com/news/content/cultivation-doomed-in-the-telugu-states-36-227064.html





