ఎన్నికల ప్రచారంపై కొవిడ్ ఆంక్షలు పనిచేస్తాయా?
Publish Date:Jan 8, 2022
Advertisement
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల శాసన సభ ఎన్నికల షెడ్యూలును ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఐదు రాష్ట్రాలలోని మొత్తం 690 (ఉత్తర ప్రదేశ్ 403, ఉత్తరాఖండ్ 70, పంజాబ్లో 117, గోవా 40, మణిపూర్ 60)అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వ తేదీ వరకు ఏడు ఫేజుల్లో పోలింగ్ పోలింగ్ నిర్వహిస్తారు.మార్చి 10వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు సెమి ఫైనల్ ఎన్నికలుగా పేర్కొంటున్న,ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఇంకా అనేక విధాల కూడా ప్రాధాన్యత ఉందని అంటున్నారు. ఒక విధంగా ఇవి అసాధరణ పరిస్థితులలో జరుగతున్న అసాధరణ ఎన్నికలని చెప్పవచ్చును. కోవిడ్-19 మహమ్మారి వల్ల ఎన్నికల నిర్వహణ భారీ సవాలుగా నిలుస్తోందని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. నిజానికి దేశంలో కోవిడ్ మహమ్మారి విస్తరిస్తున్న పరిస్థితులలో, కేంద్ర ఎన్నికల సంఘం సాహసోపేత నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో గత సంవత్సరం పశ్చిమ బెంగాల్, తమిళనాడు సహా ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎదురైనా సవాళ్ళు, విమర్శలను ఒక గుణపాఠంగా తీసుకుని,పక్కా ప్రణాళికను ఈసీ సిద్ధం చేసింది. కోవిడ్ రహిత ఎన్నికల నిర్వహణ లక్ష్యంగా కోవిడ్ నిబంధనలు అమలుకు శ్రీకారం చుట్టింది. ఇంతవరకు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా, ఈ నెల 15 వరకు రోడ్డు షోలు, పాదయాత్రలు నిర్వహించేందుకు అనుమతి లేదని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర స్పష్టం చేశారు పార్టీలు వర్చువల్ విధానంలో ప్రచారం చేసుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. విజయోత్సవ సభలు, ప్రదర్శనలను కూడా నిర్వహించరాదని చెప్పారు. ఇంటింది ప్రచారంలోనూ ఒక్కొక్క బృందంలో ఐదుగురికి మించి ఉండరాదని సీఈసీ స్పష్టం చేశారు. అయితే, ఈనెల 15 వరకు కాకుండా మొత్తనికి మొత్తంగా రోడ్డు షోలు, పాదయాత్రలపై నిషేధం విధించాలని, మాజీ సీఈసీ ఖురేషి సూచించారు. అలాగే, బహిరంగ సభల విషయంలోనూ స్పష్టత ఇవ్వాలని ఖురేసి పేర్కొన్నారు. అయితే, ఈ నెల 15 న పరిస్థితిని సమీక్షించి తదుపరి నిర్ణయం ఉంటుందని ఎన్నికల సంఘం వర్గాల సమాచారం. అదలా ఉంటే, ఇప్పటికే రాజకీయ పార్టీలు ముఖ్యంగా ఉత్తరప్రదేశ్’లో ఎన్నికల ర్యాలీలు, బహిరంగ సభలని రద్దు చేసుకుని, వర్చువల్ ప్రచారం సాగిస్తున్నాయి .. అయితే ...ఎన్నికల ప్రచారం వేడెక్కిన తర్వాత కోవిడ్ నిబంధనలు ఎంతవరకు అమలవుతాయి ... కోవిడ్ కేసులు ఇంకా ఇంకా పెరిగితే ఏమి జరుగుతుంది ..ఇలా ఇంకా అనుమానాలు అయితే వ్యక్తమవుతూనే ఉన్నాయి.
http://www.teluguone.com/news/content/covid-rules-will-effect-five-states-election-campaign-39-129904.html





