అవినీతి అంతానికి కొత్త చిట్కా.. ఏమిటంటే...
Publish Date:Apr 20, 2022
Advertisement
దేశంలో అవినీతి పెరిగి పోయింది. ఇది దశాబ్దాలుగా వింటున్న మాట. మరో వంక అవినీతిని అంత మొందిస్తామనే రాజకీయ పార్టీల ఎన్నికల వాగ్దానాలకు కొదవ లేదు. నిజానికి, 2014 ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి తెచ్చిన ప్రధాన ఎన్నికల వాగ్దానం కూడా అదే. అయితే, ఆ తర్వాత ఏమి జరిగిందో, ఏమి జరుగుతోందో చూస్తూనే ఉన్నాం. నిజమే,మోడీ ప్రభుత్వం అవినీతిని నిరోధించేందుకు కొన్ని చర్యలు తీసుకుంది. అలాగే,గతంలోనూ ప్రభుత్వాలు అవినీతిని అదుపు చేసేందుకు కొన్ని చర్యలు తీసుకున్నాయి, చట్టాలు తెచ్చాయి. అయినా శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్లుగా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ప్రభుత్వాలు ఎవైనా, అయినా, అవినీతి పెరిగింది. పెరుగుతోందే కానీ, తగ్గిన దాఖలాలు అంతగా లేవు. చట్టం తనపని తానూ చేసుకు పోతోంది అయినా, అవినీతి వ్యవస్థీకృతం అయిందనే అభియోగాలు వినిపిస్తున్నాయి. నిన్నమొన్ననే, కర్ణాటకలో మంత్రి ఈశ్వరప్ప, ప్రభుత్వ పనులు చేసిన కాంట్రాక్టర్ల నుంచి 40 పెర్సెంట్ డిమాండ్ చేస్తున్నారనే అభియోగం పై మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇదొకటి తాజాగా వెలుగు చూసిన ఉదంతం అయితే, వెలుగు చూడని కథలు ఎన్నున్నాయో .. ఎవరికీ తెలియదు. ఈ నేపద్యంలో కేంద్ర ప్రభుత్వం రాజకీయ, ప్రభుత్వ యంత్రాంగ అవినీతిని, అదుపు చేసేందుకు స్థిరాస్తులు అన్నింటినీ ఆధార్’తో అనుసంధానం చేయాలనే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి సుప్రీం కోర్టు అభిప్రాయం కోరిన కేంద్ర ప్రభుత్వం, సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయం రాగానే, అడుగు ముందుకేస్తుందని అధికార వర్గాల సమాచారం. నిజంగా, ఇది నిజమే అయితే, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం అలాంటి సాహసోపేతమైన నిర్ణయమే తీసుకుంటే, అది నిస్సందేహంగా అవినీతి అంతం దిశగా తీసుకునే, చాలా చాలా గొప్ప ముందడుగు అవుతుందని, అంటున్నారు. ఆధార్ ఇప్పటికే పాన్ తో అనుసంధానం అయినందున, వ్యక్తుల స్థిరాస్థులను ఆధార్’తో అనుసంధానం చేస్తే, దొంగ సొమ్ముతో, బినామీ పేర్లతో ఆస్తులు కూడబెట్టిన అక్రమార్కుల చిట్టా దొరికి పోతుందని ప్రభుత్వం భావిస్తోంది. అదే జరిగితే, బినామీల పేరున అక్రమ ఆస్తులు కూడ బెట్టిన అక్రమార్కులు ఫ్లాట్స్,ఇళ్లు, ఇతర స్థిరాస్తులను విక్రయించక తప్పని గత్యంతర పరిస్థితి వస్తుంది. దీంతో ఫ్లాట్స్, ఇళ్ల ధరలు దిగివస్తాయని ప్రభుత్వం ఆశిస్తోంది. అలాగే, ఆస్తులు బినామీ పేర్లతో ఉంటే,ప్రభుత్వం ఆ ఆస్తులను జప్తు చేసి, వేలంలో విక్రయించే అధికారం చిక్కుతుంది. అవిధంగా ప్రభుత్వానికి వేల కోట్ల రుపాయాల ఆదాయం వస్తుంది. అలాగే అక్రమార్కుల గుట్టు రట్టయి శిక్షలు అనుభవించ వలసి వస్తుంది. ఆవిధంగా ఆధార్’తో ఆస్తుల అనుసంధానం వలన కాలక్రమంలో అవినీతి అంతరించి పోతుందని, ప్రభుత్వం ఆశిస్తోంది. అయితే, అది అంత సులభమా అంటే, కాదనే అంటున్నారు.
అవినీతికి అలవాటు పడిన రాజకీయ బేహారులు, ప్రభుత్వ అధికారులు, వ్యాపారవేత్తలు తమ అక్రమ సంపదనను, చాలా వరకు ఇంటి పని వారు, డ్రైవర్లు, బంధువులు, బామ్మర్దులు ఇతర బినామీల పేరున భూములు,ఇళ్లు, విల్లాలు వంటి ఇతర స్థిరాస్తులు కొని, చట్టానికి చిక్కకుండా తప్పించుకుంటున్నారు. అందుకే ఈ బినామీ వ్యవహారాలకు చెక్ పెట్టేందుకు, వ్యక్తుల స్థిరాస్తుల వివరాలను ఆధార్’కు అనుసంధానం చేయాలనే ప్రతిపాదన వచ్చింది. కాగా, కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదన అమలు చేసేందుకు సిద్దంగా ఉందని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/corruption-control-in-india-39-134669.html





