'కొట్టు' మంత్రి పదవి వెనుక రూ.వెయ్యి కోట్ల క్విడ్ ప్రో కో?
Publish Date:Apr 12, 2022
Advertisement
సీఎం జగన్ మంత్రి పదవులను అమ్ముకున్నారా? ఆ డిప్యూటీ సీఎం పోస్టు వెనుక వెయ్యి కోట్ల విలువైన డీల్ నడిచిందా? కేబినెట్ ప్రకటించే వరకూ అసలు రేసులోనే లేని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణకు సడెన్‌గా మంత్రి పదవి ఎలా వరించింది? ఏకంగా ఉప ముఖ్యమంత్రి ఎలా కాగలిగారు? విశాఖ మధురవాడ ల్యాండ్‌కు.. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేకి లింక్ ఏంటి? తాడేపల్లిప్యాలెస్ తరహాలో.. వైజాగ్‌లో విజయసాయిరెడ్డి కొత్త ప్యాలెస్ కథేంటి? ఇలా పలు ప్రశ్నలతో.. కొట్టు సత్యనారాయణకు డిప్యూటీ సీఎం పోస్టు ఇప్పుడు పొలిటికల్‌గా కాక రేపుతోంది. సీఎం జగన్ కేబినెట్‌లో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణకు చోటు కల్పించడం, ఉపముఖ్యమంత్రి పదవి కూడా కట్టబెట్టడంతో.. విశాఖలోని మధురవాడలో 97.30 ఎకరాల భూమిని ఎన్‌సీసీ సంస్థకు కారు చౌకగా రూ.187 కోట్లకే విక్రయించిన వ్యవహారం మళ్లీ తెరమీదకు వచ్చింది. NCC సంస్థ ఆ భూమిని రూ.200 కోట్లకు బెంగళూరుకి చెందిన GRPL అనే కంపెనీకి అమ్మేసినట్టు వార్తలు రావడం, ఆ కంపెనీ కొట్టు సత్యనారాయణ తమ్ముడు కొట్టు మురళీకృష్ణది కావడంతో.. దీని వెనుక భారీ క్విడ్ ప్రో కో వ్యవహారం ఉందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ‘‘జగన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై కొన్ని రోజులుగా బయట చర్చ జరుగుతున్నా.. మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నవారిలో కొట్టు సత్యనారాయణ పేరు ఎప్పుడూ వినపడలేదు. ఇప్పుడు హఠాత్తుగా ఆయనకు కీలకమైన పదవి దక్కడంలోని ఆంతర్యం ఏమిటి?’’ అని ప్రశ్నించారు విశాఖకు చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి. ‘‘మధురవాడలో ఓపెన్ మార్కెట్‌లో చదరపు గజం రూ.60 వేల ధర పలుకుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌సీసీ సంస్థకు ఎకరం రూ.1.93 కోట్లకే విక్రయించింది. అంటే చ.గజం రూ.4. వేలకే అమ్మేసింది. రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయించిన విలువ ప్రకారం చూసినా ఆ భూమి విలువ రూ.వెయ్యి కోట్లకుపైనే. మరెందుకు అంత చీప్‌గా అమ్మేసినట్టు? ఈ వ్యవహారంలో సీఎం జగన్‌కి కనీసం రూ.వెయ్యి కోట్ల లబ్ధి చేకూరుతుంది. దానికి బదులుగా ఇచ్చిన బహుమతే మంత్రి పదవి. అంటే కొట్టు సత్యనారాయణ పదవి విలువ రూ.వెయ్యి కోట్లన్న మాట..’’ అని బండారు సత్యనారాయణమూర్తి ఆరోపించడం కలకలం రేపుతోంది. విశాఖలో అదే కొట్టు మురళీకృష్ణకు చెందిన మరో ప్రాజెక్టులోని విశాలమైన స్థలంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విలాసవంతమైన భవనం నిర్మిస్తున్నారని, వారి మధ్య కుమ్మక్కుకి ఇది మరో నిదర్శనమని బండారు ఆరోపించడం సంచలనంగా మారింది
http://www.teluguone.com/news/content/controversy-over-kottu-satyanarayana-minister-post-39-134259.html





