రాహుల్ కు ఫిర్యాదు చేస్తా: తెలంగాణ సీఎం రేవంత్ పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరుగుబావుటా.!
Publish Date:Oct 12, 2026
Advertisement
తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మ సారి రచ్చకెక్కాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కొంతకాలంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మధ్యమధ్యలో అడపాతడపా తగ్గిన ఆ అసంతృప్తి ఇప్పుడు ముదిరి పాకాన పడింది. రేడియల్ రోడ్ల టెండర్ల వ్యవహారంలో రేవంత్ రెడ్డి ఆంధ్రా కాంట్రాక్టర్లకు అనుకూలంగా వ్యవహరించారంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుటుంబానికి చెందిన సుశీ ఇన్‌ఫ్రా సంస్థ సొంత ప్రభుత్వమే అన్యాయం చేసిందని ఫైర్ అయ్యారు. ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టికి తీసుకెడతాననీ, రేవంత్ పై రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేస్తాననీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని బుద్వేల్ నుంచి కొడంగల్ సమీపంలోని ఎన్‌హెచ్-167ఎన్ వరకు సుమారు 81.15 కిలోమీటర్ల రేడియల్ రోడ్డు-2 నిర్మాణానికి ప్రభుత్వం టెండర్లు పిలిచింది. దాదాపు 3 వేల 296 కోట్ల రూపాయల విలువైన ఈ ప్రాజెక్టును మూడు ప్యాకేజీలుగా విభజించారు. ఈ టెండర్లలో సుశీ ఇన్‌ఫ్రా సంస్థ కూడా పాల్గొంది. అయితే సాంకేతిక అర్హతల పరిశీలనలో ఆ సంస్థ బిడ్లను అధికారులు తిరస్కరించడం వివాదానికి కారణమైంది. సుశీ ఇన్‌ఫ్రా వాదన ప్రకారం.. తమ సంస్థ తక్కువ ధరకు బిడ్ వేసినప్పటికీ, సాంకేతిక కారణాలు చూపుతూ టెండర్ ప్రక్రియ నుంచి తప్పించారు. తమ సంస్థకు పనులు దక్కకుండా చేయడం వల్ల ప్రభుత్వ ఖజానాపై సుమారు 6వందల కోట్ల అదనపు భారం పడే అవకాశం ఉందని కంపెనీ టెండర్లలో తమ నిర్ణయాలు నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయని ప్రభుత్వం అంటోంది. ఈ నేపథ్యంలోనే టెండర్ల ప్రక్రియలో తమకు అన్యాయం జరిగిందని పేర్కొంటూ సుశీ ఇన్‌ఫ్రా హైకోర్టును ఆశ్రయించింది. అనుభవ ధ్రువీకరణ పత్రానికి సంబంధించిన సాంకేతిక అభ్యంతరాల ఆధారంగా బిడ్లను తిరస్కరించడాన్ని ఆ సంస్థ సవాలు చేసింది. అవసరమైతే వివరణ కోరే అవకాశం ఇవ్వాల్సిందని పిటిషనర్ వాదించారు. మరోవైపు, టెండర్ల ప్రక్రియలో తదుపరి దశలు ఇప్పటికే పూర్తయ్యాయని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. రాజగోపాల్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి మధ్య విభేదాలు కేవలం ఈ టెండర్ల వ్యవహారానికే పరిమితం కావడం లేదన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. ఇప్పుడు ఈ విషయంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేవంత్ లక్ష్యంగా విమర్శలు సంధిస్తున్నారు. సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది. కోమటిరెడ్డి హెచ్చరికతో ఇప్పుడు వివాదం కేవలం కాంట్రాక్టులకు సంబంధించిన వివాదంగా కాకుండా, రేవంత్ రెడ్డి నాయకత్వం, పార్టీ అంతర్గత విభేదాలు, ఎమ్మెల్యేల అసంతృప్తి వంటి అంశాలపై పంచాయతీగా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రేడియల్ రోడ్ల టెండర్లపై ప్రతిపక్ష బీఆర్‌ఎస్ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. టెండర్ల వివరాలను బహిర్గతం చేయాలని, ప్రక్రియపై సమగ్ర విచారణ జరపాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. దీంతో ఒకవైపు కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు, మరోవైపు ప్రతిపక్ష విమర్శల నేపథ్యంలో రేడియల్ రోడ్ల ప్రాజెక్టు చుట్టూ రాజకీయ వేడి రాజుకుంది.
[Congress Internal Rift, Dispute, Komatireddy Rajagopal Reddy, Revanth Reddy, Susi Infra, Radial Road Tenders,Complaint Rahul Gandhi, KTR, BRS, Telugu One]
http://www.teluguone.com/news/content/congress-internal-rift-39-234135.html





