తెలంగాణలో కాంగ్రెస్ ‘ఎత్తర జెండా!’
Publish Date:Jun 5, 2023
Advertisement
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు అన్ని రాజకీయ పక్షాలూ సిద్ధం అవుతున్నాయి. అధికార బీఆర్ఎస్ తన పట్టు నిలబెట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. అధికారానికి దూరమైన కాంగ్రెస్ తన పూర్వ వైభవం కోసం శక్తి వంచన లేకుండా పని చేస్తోంది. మొన్నమొన్నటి వరకూ తమదే గెలుపు అని చెప్పుకున్న బీజేపీ ఇప్పుడు చప్పుడు చేయడం లేదు. తెలుగుదేశం పార్టీ తన బలాన్ని మరో సారి ప్రదర్శించే పనిలో ఉంది. కమ్యూనిస్టులు, బీఎస్పీ వంటి పార్టీలు ఇంత వరకూ ఎన్నికల ఊసే ఎత్తడం లేదు. జూన్ 2వ తేదీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ప్రకటనతో తెలంగాణ సహా రాజస్థాన్, మిజోరం, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లలో ఎన్నికలు జరగబోతున్నాయని స్పష్టమైంది. ఇటీవల ముగిసిన కర్నాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణలో అధికార పార్టీ అధినేతకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అనుసరించిన వ్యూహం ఫలితాలను ఇవ్వడంతో తెలంగాణలో కూడా అలాంటి వ్యూహాన్నే అవలంబిచాలని భావిస్తోంది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ఇక్కడ అధికారంలోకి రాకపోవడానికి గల కారణాలను అన్వేషిస్తోంది. కర్నాటక, తెలంగాణలో ఉన్న సారూప్యతలపై అధ్యయనం చేస్తున్న కాంగ్రెస్ ఇక్కడి ముస్లిం ఓట్లపై గురిపెట్టింది. హిజాబ్, టిప్పు సుల్తాన్ వంటి అంశాలు ఇక్కడ లేకపోవడంతో రాజకీయ రిజర్వేషన్లపై కాంగ్రెస్ దృష్టి పెడుతోంది. మరో వైపు ముఖ్యమంత్రి పదవి అల్ప సంఖ్యాక వర్గాలకు ఇవ్వాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ పాలనను తొమ్మిదేళ్లుగా చూస్తున్న తెలంగాణ ప్రజానీకం మార్పు కోరుకుంటున్నారని, ఆ మార్పు రానున్న అసెంబ్లీ ఎన్నికలలో ప్రధానంగా కనిపించబోతోందని రాజకీయ విశ్లేషకుల అంచనా. అంబేడ్కర్ విగ్రహం, కొత్త సచివాలయం, అమరుల స్థూపం వంటి నిర్మాణాలు, దళిత బంధు వంటి కార్యక్రమాలు బీఆర్ఎస్ గ్రాఫ్ ని మరీ పతనం కాకుండా కాపాడినా కాంగ్రెస్ గెలుపును ఆపలేవని తాజా సర్వేలు చేబుతున్నాయి. మే నెలలో ఓ ప్రముఖ సంస్థ జరిపిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. కాంగ్రెస్ వర్గ విభేదాలు పక్కన పెట్టి పని చేస్తే రానున్న ఎన్నికలలో 41శాతం ఓటు షేరును సాధించి 68 సీట్లు గెలవగలదని ఆ సర్వే తేల్చింది. 37శాతం ఓట్లతో బీఆర్ఎస్ పార్టీ 35 సీ్టలు, పది శాతం ఓట్లతో బీజేపీ 8 సీట్లు, 3శాతం ఓట్లతో ఎంఐఎం 6 సీట్లను తమ ఖాతాలో వేసుకోనుండగా, ఒకరిద్దరు ఇతరులు విజయం సాధిస్తారని ఈ సర్వే తేటతెల్లం చేసింది. తొమ్మదిన్నరేళ్లు అధికారంలో ఉండడం, కింది స్థాయి నాయకులపై ప్రజల్లో అసంతృప్తి ఉండటం, టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడం వంటి కారణాలు కేసీఆర్ కు సమస్యగా మారగా, వరుస తప్పిదాలు, నాయకత్వ లోపం, స్పష్టమైన అభివృద్ధి అజెండా లేకపోవడం, కేసుల విషయంలో కప్పదాట్లు బీజేపీ పాలిట శాపంగా మారాయి. అభ్యుదయ వాదులు, చైతన్యవంతులైన తెలంగాణ ప్రజలకు బీజేపీ మాటలపై, ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ మాటలపై నమ్మకం పోయింది. ఈ రాజకీయ పరిస్థితిని అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్ వ్యూహ రచన చేస్తోంది. ప్రస్తుతం తెలంగాణలోని తటస్థ నాయకులకు కాంగ్రెస్ ఏకైక ఎంపికగా మారిందనడంలో ఏ మాత్రం సంశయం అక్కర్లేదు.
http://www.teluguone.com/news/content/congress-gaining-in-telangana-25-156361.html