అల్లు అర్జున్ పై జాతీయ మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు
Publish Date:Dec 20, 2024
Advertisement
సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనకు సంబంధించి నటుడు అల్లు అర్జున్ పై జాతీయ మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు అందింది. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. పుష్ప-2 ప్రీమియర్స్‌కు నటీనటులను ఎవరినీ రావొద్దని చెప్పాలని తాము సంధ్యా థియేటర్ యాజమాన్యానికి ముందుగానే సమాచారం ఇచ్చామని పోలీసులు తెలిపారు. ఘటన జరిగినప్పటి నుంచి స్పందించని సంధ్య థియేటర్ యాజమాన్యం.. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన నేపథ్యంలో.. బందోబస్తు చేయాలంటూ పోలీసులను కోరుతూ రాసిన లేఖను విడుదల చేసింది. దీనిపై పోలీసులు కూడా ప్రీమియర్స్‌కు హీరో, హీరోయిన్ రావడంతో ఇక్కడ తీవ్ర స్థాయిలో జనాలు గుమిగూడే అవకాశాలు ఉన్నాయని థియేటర్ యాజమాన్యానికి సూచించామని చెప్పిన పోలీసులు. ఈ క్రమంలో ప్రీమియర్స్‌కు నటీనటులు, మూవీ టీమ్ ఎవరినీ అనుమతించవద్దంటూ థియేటర్ యాజమాన్యానికి చిక్కడిపల్లి పోలీసులు రాతపూర్వకంగా సమాచారం ఇచ్చారు. ఆ లేఖను పోలీసులు విడుదల చేశారు. పోలీసులు సూచనలను ఖాతరు చేయకుండా హీరో అల్లు అర్జున్ ఆరోజు థియేటర్‌కు చేరుకున్నారు. పోలీసులు ఊహించిన విధంగానే భారీ సంఖ్యలో అభిమానులు ఎగబడటం, వారిని కంట్రోల్ చేయడం కోసం అల్లు అర్జున్ పర్సనల్ సెక్యూరిటీ అభిమానులను తోసేయడంతో తోపులాట చోటు చేసుకుందని పోలీసు వర్గాలు చెప్పాయి. అంతే కాకుండా పోలీసుల సూచనలను తుంగలోకి తొక్కి ధియేటర్ కు వచ్చిన అల్లు అర్జున్.. సైలెంట్‌గా థియేటర్‌లోకి వెళ్లకుండా నిబంధనలను ఉల్లంఘించి అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే తొక్కిసలాటలో రేవతి అనే యువతి మరణించిందనీ, ఆమె కుమారుడు శ్రీతేజ పరిస్థితి విషమంగా ఉందనీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే.. ఈ నెల 13న అల్లు అర్జున్‌ను ఉ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి.. నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు. అయితే హైకోర్టు.. అల్లు అర్జున్‌కు వ్యక్తిగత పూచీకత్తుతో మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో మరుసటి రోజు ఉదయం అంటే డిసెంబర్ 14న ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. ఈ నేపథ్యంలోనే ఓ వ్యక్తి ప్రచారం మోజులో పడి ఓ యువతి మృతికి కారకులయ్యారంటూ అల్లు అర్జున్ పై జాతీయ మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ప్రేక్షకులను నియంత్రించడం కష్టమని పోలీసులు ముందుగానే చెప్పినా అల్లు అర్జున్ పట్టించుకోలేదని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై జాతీయ మానవహక్కుల కమిషన్ స్పందన ఏమిటననది తెలియాల్సి ఉంది.
http://www.teluguone.com/news/content/complaint-on-allu-arjun-in-nhrc-39-190121.html