కాక్రోచ్ జనతా పార్టీ.. ఆరంభ బుస్సు.. ప్రభావం తుస్సు?!
Publish Date:Jul 14, 2026
Advertisement
దేశ వ్యాప్తంగా యువత, విద్యార్థుల హక్కుల కోసం సోషల్ మీడియాలో భారీ సంచలనం సృష్టించిన కాక్రోచ్ జంతాపార్టీ ఆరంభం అద్భుతం అయినా ప్రభావం మాత్రం శూన్యంగా మారింది. ఆ పార్టీ చేపట్టిన ప్రజా ఉద్యమం ప్రజా క్షేత్రంలో ఎటువంటి ప్రభావం చూపలేదని పరిశీలకులు పెదవి విరుస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సాగుతున్న ఈ వినూత్న నిరసన ప్రదర్శనలకు మెల్లిమెల్లిగా జనం ముఖం చాటేస్తున్నారు. పరీక్షల అవకతవకలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా డిమాండ్‌తో ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం.. ఆరంభంలో లక్షలాది మంది యువతను ఆకర్షించింది. అయితే క్రమక్రమంగా జనాదరణ కోల్పోయి ఇప్పుడు జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆ పార్టీ నిరసనలు తూతూ మంత్రంగా మారాయి. సోషల్ మీడియా వేదికగా ఇన్ స్టాగ్రామ్, ఎక్స్ లలో దాదాపు మిలియన్ల కొద్దీ ఫాలోవర్లను సంపాదించుకుని, ఒకేసారి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న కాక్రోచ్ జనతాపార్టీ.. వ్యూహ వైభల్యాలతో ఎంత వేగంగా జనాదరణ పొందిందో, అంతే వేగంగా ప్రజల నిరాసక్తతను చవి చూస్తోంది. కాక్రోచ్ జనతాపార్టీ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు అయిన అభిజీత్ దీప్కే వర్చువల్ ప్రపంచంలో చూపిన ఉధృతి.. ఆయన ప్రసంగాలలో ఇసుమంతైనా కనిపించడం లేదు. ఆరంభంలో పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్‌చుక్ వంటి ప్రముఖుల మద్దతు లభించినప్పటికీ, క్షేత్రస్థాయిలో నిరంతరాయంగా జన సమూహాలను నిలిపి ఉంచడంలో.. ఉద్యమ తీవ్రతను కాపాడటంలో నాయకత్వం విఫలమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/cockroach-janata-party-flop-impact-25-225979.html





