కేసీఆర్ శుక్రాచార్యుడు.. కేటీఆర్ మారీచుడు.. విమర్శల దాడి పెంచిన సీఎం రేవంత్
Publish Date:Jan 13, 2026
Advertisement
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ లపై విమర్శల దాడి పెంచారు. ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్యా నీటి పంపకాలపై జరుగుతున్న చర్యలు, వివాదాల నేపథ్యంలో రేవంత్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ లను రాక్షసులుగా అభివర్ణించారు. కేసీఆర్, కేటీఆర్ లపై రేవంత్ చేసిన విమర్శలు ఇప్పటికే వేడెక్కి ఉన్న రాజకీయ వాతావారణాన్ని మరింత వేడెక్కించాయి. రెండు తెలుగు రాష్ట్రాలూ కలిసి ముందుకు నడవాలన్న ప్రయత్నాలు కొందరికి రుచించవన్నారు. ఈ సందర్భంగానే ఆయన మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఆధునిక శుక్రాచార్యుడిగా అభివర్ణించారు. శుక్రాచార్యుడు రాక్షసుల గురువన్న సంగతి తెలిసిందే. ఇక కేటీఆర్ ను అయితే ఆయన ఏకంగా మారీచుడిగా అభివర్ణించారు. పురాతన కాలంలో ఈ రాక్షసులు యాగాలను, యజ్ణాలను ఆపారనీ, ఇప్పుడు ఆధునిక కాలంలో శుక్రాచార్యుడి పాత్రను కేసీఆర్, మారీచుడి పాత్రను కేటీఆర్ పోషిస్తూ ప్రజాస్వామ్య బద్ధంగా తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకుంటున్నారని విమర్శించారు. ప్రజా శ్రేయస్సు కోసం, రాష్ట్ర పురోగతి కోసం చేస్తున్న ప్రయత్నాలను రాక్షసుల్లో కేసీఆర్, కేటీఆర్ అడ్డుకుంటున్నారని రేవంత్ అన్నారు. ఫామ్‌హౌస్ వదిలి బయటకు రాని ఆధునిక శుక్రాచార్యుడు, అసెంబ్లీకి హాజరౌతున్న మారీచుడి ప్రభావాలకు లోను కావద్దని ప్రజలను కోరారు. ముఖ్యంగా నీటి పంపకం వంటి సున్నితమైన అంశాలపై కేసీఆర్, కేటీఆర్ ల దుష్ట పన్నాగాలు, మాటల ప్రభావానికి లోనుకాకుండా వాస్తవాల ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని రేవంత్ అన్నారు. జలవివాదాల విషయంలో పొరుగు రాష్ట్రంలో చర్చల ద్వారా పరిష్కారం కోసం రేవంత్ ప్రయత్నిస్తుంటే, కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ లు కోట్లాడి సాధించుకోవాలంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శిస్తూ రేవంత వారిరువురినీ శుక్రాచార్యుడు, మారీచులతో పోల్చారు.
http://www.teluguone.com/news/content/cm-revanth-reddy-say-kcr-sukracharya-39-212460.html





