రాజకీయ గూఢచర్యంలో భాగమే ఈడీ దాడులు.. కేంద్రంపై తృణమూల్ ధ్వజం
Publish Date:Jan 10, 2026
Advertisement
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలోని ఐప్యాక్ కార్యాలయం, ఆ సంస్థ చీఫ్ ప్రతీక్ జైన్ నివాసాలపై ఈడీ సోదాలు ఆ రాష్ట్రంలో పెను రాజకీయ వివాదానికి దారి తీశాయి. ఈ దాడులను ఆ రాష్ట్రంలో అధకారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ రాజకీయ గూఢచర్యంగా అభివర్ణించింది. ఐప్యాక్ చీఫ్ ప్రతీక్ జైన్ నివాసంలో ఈడీ సోదాలు జరుగుతుండగా మమతా బెనర్జీ అక్కడికి వెళ్లడాన్ని తృణమూల్ కాంగ్రెస్ సమర్ధించుకుంది. ఈ మేరకు ఆ పార్టీ ఎంపీ మహువామోయిత్రా మాట్లాడుతూ.. సీఎం మమతా బెనర్జీ తృణమూల్ అధినేత్రి కూడా అని పేర్కొన్నా మహువా మోయిత్రా, ఇంట్లో దొంగతనం జరుగుతున్నప్పుడు మన వస్తువులను కాపాడుకునే హక్కు మనకు ఉంటుంది కదా అన్నారు. పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ ప్రత్యర్థులను అణచివేయడానికి ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను ఆయుధాలుగా ప్రయోగిస్తోందని ధ్వజమెత్తారు. కేంద్రంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని బీజేపీ సాగిస్తున్న దోపిడీని, గూండాయిజాన్ని ఎదుర్కొంటున్న ఏకైక నాయకురాలు మమతా బెనర్జీ మాత్రమేనన్న మహువా మోయిత్రా ఎన్నికల వ్యూహాలు, అభ్యర్థుల జాబితా వంటి రహస్య డేటాను దొంగిలించేందుకే ఈడీ దాడులని తీవ్ర విమర్శలు చేశారు. ఈడీ దాడులకు నిరసనగా మమతా బెనర్జీ కోల్‌కతాలో భారీ పాదయాత్ర నిర్వహించారు.ఆ ర్యాలీకి సంఘీ భావంగా ఢిల్లీలో నిరసన చేపట్టిన టీఎంసీ ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు, తమ దర్యాప్తును ముఖ్యమంత్రి అడ్డుకున్నారని ఈడీ, తమ పార్టీ సమాచారాన్ని అక్రమంగా సేకరించారని టీఎంసీ కలకత్తా హైకోర్టును ఆశ్రయించాయి. వీటిపై విచారణను కోర్టు ఈ నెల 14కు వాయిదా వేసింది. ఇలా ఉండగా తమ పార్టీ రాజకీయ వ్యూహకర్త ఐ-ప్యాక్ పై ఎ ఈడీ దాడుల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తనపైన, తన ప్రభుత్వంపైన స్థాయికి మించి ఒత్తిడి పెంచితే బొగ్గు కుంభకోణంలో అమిత్ షా పాత్రకు సంబంధించి తన వద్ద ఉన్న ఆధారాలను బయటపెడతానని హెచ్చరించారు.
http://www.teluguone.com/news/content/enforcement-directorate-raids-are-political-espionage-39-212329.html





