రైతులు, మహిళలపై వరాల జల్లు.. స్వాతంత్ర్య వేడుకల్లో రేవంత్ కీలక ప్రసంగం..!
Publish Date:Aug 15, 2026
Advertisement
గోల్కొండ కోటలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి, అనంతరం తెలంగాణ పోలీసు బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. వేడుకల్లో తొలిసారిగా వందేమాతరం గీతాలాపన నిర్వహించడంతో దేశభక్తి భావం ఉప్పొంగింది. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ నిర్మించిన ప్రాజెక్టులను ఆధునిక దేవాలయాలుగా అభివర్ణించిన సీఎం.. ఆయన వేసిన పునాదుల ఫలితాలను నేడు దేశం అనుభవిస్తోందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 32 నెలల కాలంలో చేసిన కృషి ఫలితాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పారు. ఆర్థిక ప్రగతిలో తెలంగాణ ముందంజలో ఉందని, దేశ సగటు తలసరి ఆదాయంతో పోలిస్తే రాష్ట్ర తలసరి ఆదాయం 92 శాతం అధికంగా ఉందని వివరించారు. వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి బయటకు తీసుకొచ్చి పండగలా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ రెడ్డి అన్నారు. రైతుల సంక్షేమం కోసం ఇప్పటివరకు రూ.1.70 లక్షల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. రైతు భరోసా పథకం కింద వేల కోట్ల రూపాయలను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశామని, దీంతో రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి రికార్డు స్థాయికి చేరిందని చెప్పారు. తెలంగాణ నీటి హక్కుల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడబోమని సీఎం స్పష్టం చేశారు. పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులను త్వరలో పూర్తి చేసి కృష్ణా జలాలను పారిస్తామని తెలిపారు. ఉచిత విద్యుత్ పథకం ద్వారా వ్యవసాయానికి, గృహాలకు నిరంతర విద్యుత్ సరఫరా అందిస్తున్నామని పేర్కొన్నారు. మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రేవంత్ రెడ్డి చెప్పారు. కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా పేద ఆడబిడ్డల వివాహాల కోసం ఇప్పటివరకు రూ.4,790 కోట్లు అందించామని తెలిపారు. మహిళలను కేవలం లబ్ధిదారులుగా కాకుండా విజయవంతమైన వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఆర్టీసీ అద్దె బస్సులకు మహిళలనే యజమానులుగా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. అలాగే 15 లక్షల కొత్త రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించినట్లు వెల్లడించారు. CM Revanth Reddy, Golconda Fort Independence Day, Telangana Flag Hoisting, Vande Mataram Golconda Fort
http://www.teluguone.com/news/content/cm-revanth-reddy-36-228982.html





