ఢిల్లీని వదిలి ఎవరూ వెళ్లొద్దు: తెలంగాణ కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్ ఆదేశాలు.!
Publish Date:Oct 12, 2026
Advertisement
జాతీయ రాజధాని ఢిల్లీలో రాజకీయ వేడెక్కుతున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ అత్యంత కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదేశాల మేరకు అక్టోబర్ 11 రాత్రి లేదా అక్టోబర్ 12 ఉదయం నాటికి లోక్సభ, రాజ్యసభ సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షులు ముఖ్య నేతలందరూ ఢిల్లీకి చేరుకోవాలని స్పష్టం చేశారు. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు ఎన్నికల సంఘం తీరుకు వ్యతిరేకంగా, అలాగే కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ ఢిల్లీ కేంద్రంగా భారీ నిరసన కార్యక్రమాలు, ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశానికి హాజరుకావడాన్ని అత్యంత ప్రాధాన్యతగా పరిగణించాలని ఆదేశించారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో, తాము తదుపరి ఆదేశాలు జారీ చేసేంత వరకు ఎవరూ కూడా ఢిల్లీని విడిచి హైదరాబాద్ లేదా సొంత ప్రాంతాలకు వెళ్లొద్దని సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ స్పష్టం చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నాయకత్వంలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహాధర్నా ఆందోళనల్లో తెలంగాణ నుంచి తరలివెళ్లిన ప్రతి నాయకుడు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని తేల్చిచెప్పారు. ముఖ్యంగా ఎన్నికల జాబితా సవరణ (SIR) ప్రక్రియలో జరిగిన లోపాలను, ప్రజాస్వామ్య హాలాన్ని కాపాడుకునేందుకు కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీనామా డిమాండ్ చేస్తూ చేపట్టిన ఈ ఆందోళనల్లో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు సమష్టి కృషితో కేంద్రంపై పోరాటం ఉద్ధృతం చేయాలని, రాష్ట్రాల హక్కుల పరిరక్షణ కోసం దేశ రాజధాని వేదికగా గళం వినిపించడంలో ప్రతి నాయకుడి భాగస్వామ్యం ఎంతో కీలకమని నేతలు అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా గోవా పర్యటనను ముగించుకుని నేరుగా ఢిల్లీకి చేరుకుని ఈ ఆందోళనల్లో పాల్గొనడం విశేషం. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు సీనియర్ నేతలు ఇప్పటికే ఢిల్లీకి చేరుకుని నిరసనల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అధిష్టానం ఆదేశాలను బేఖాతరు చేయకుండా, ఎట్టి పరిస్థితుల్లోనూ తదుపరి సూచనలు వచ్చే వరకు ఢిల్లీ కేంద్రంగానే ఉండి పార్టీ కార్యాచరణను విజయవంతం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. [ CM Revanth Reddy, Mahesh Kumar Goud, Telangana Congress, Delhi Protests, KC Venugopal, AICC Delhi Rally, Rahul Gandhi, Election Commission of India, Special Intensive Revision, Supreme Court, CEC Gyanesh Kumar ]
http://www.teluguone.com/news/content/cm-revanth-reddy-25-234175.html




