కేసీఆర్ ప్రధాని మోడీని కలిసింది అందుకేనా? రేవంత్ రియాక్షన్ ఏంటో?
Publish Date:Sep 3, 2021
Advertisement
దేశ రాజధానిలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సడెన్ గా ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. సాయంత్రం ఐదు గంటలకు ప్రధాని నివాసానికి వెళ్లిన కేసీఆర్.. ప్రధానితో సుమారు 50 నిమిషాలపాటు చర్చించారు. ఏపీ, తెలంగాణ మధ్య జలవివాదం, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చ జరిపారు. మొత్తంగా 16 అంశాలపై ప్రధాని మోడీకి కేసీఆర్ వినతిపత్రం సమర్పించారు. ఇందులో ఐపీఎస్‌ల సంఖ్యపెంపు, కొత్తజిల్లాలకు ఐపీఎస్‌ల కేటాయింపు, హైదరాబాద్- నాగ్‌పూర్ ఇండస్ట్రీయల్ కారిడార్ ప్రధాన అంశాలుగా ఉన్నాయి. పీఎంజీఎస్‌వైకి అదనపు నిధులు కేటాయింపు, కొత్త జిల్లాలకు జవహర్ నవోదయ విద్యాలయాలను కేటాయించాలని ప్రధానికి తెలంగాణ ముఖ్యమంత్రి విన్నవించారు. తెలంగాణకు గిరిజన వర్సిటీ, ఐఐఎం, కరీంనగర్‌కు ఐఐటీ, వరంగల్‌లో టెక్స్టైల్ పార్క్‌కు రూ.1,000 కోట్లు మంజూరు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కోసం కేంద్రం నుంచి తగిన రీతిలో సహకరించాల్సిందిగా కేసీఆర్ కోరారు. సీఎం కేసీఆర్ ఢిల్లీ షెడ్యూల్ లో ప్రధానితో సమావేశం లేదు. ప్రధానిని కలవాలని కేసీఆర్ అనుకుంటున్నట్లు కూడా సమాచారం బయటికి రాలేదు. కాని సడెన్ గా ప్రధాని మోడీ నివాసంలో కేసీఆర్ ప్రత్యక్షం కావడం చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలో నిర్మించనున్న తెలంగాణ భవన్ భూమి పూజ కోసం బుధవారం హస్తినకు వెళ్లారు కేసీఆర్. టీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా భారీగా వెళ్లారు. గురువారం పార్టీ నిర్మాణ పనులకు కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం శనివారం ఉదయం ఆయన హైదరాబాద్ తిరిగి వచ్చేయాలి. షెడ్యూల్ లో లేకున్నా ప్రధాని మోడీతో కేసీఆర్ సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.శనివారం కేంద్రం హోంమంత్రి అమిత్ షాతోనూ ముఖ్యమంత్రి భేటీ అవుతారని తెలుస్తోంది. జాతీయ స్థాయిలో ప్రస్తుతం ఎన్డీఏ వ్యతిరేక కూటమి ఏర్పాటు ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. ఇటీవలే కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ విపక్ష పార్టీల నేతలతో సమావేశమయ్యారు. మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యమించాలని నిర్ణయించారు. అయితే ఈ సమావేశానికి టీఆర్ఎస్ అధినేత అయిన కేసీఆర్ కు సమాచారం రాలేదు. తమ కూటమిలోకి కేసీఆర్ ను తీసుకోవడానికి సోనియా ఇష్టంగా లేరని చెబుతున్నారు. కేసీఆర్ ను బీజేపీ మనిషిగానే ఆమె చూస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రధాని మోడీతో కేసీఆర్ సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణలో ప్రస్తుతం బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. కేసీఆర్ సర్కార్ పై ఓ రేంజ్ లో ఫైరవుతున్నారు కమలనాధులు. పాదయాత్ర చేస్తున్న ఎంపీ బండి సంజయ్.. కేసీఆర్ సర్కార్ పై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. కేసీఆర్ ను జైలుకు పంపిస్తామని చెబుతున్నారు. మరోవైపు బీజేపీ, టీఆర్ఎస్ ఒకటేనని, రెండు పార్టీలు కావాలనే డ్రామాలు చేస్తున్నాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీతో కేసీఆర్ సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రధానితో జరిగిన సమావేశంలో రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చాయని తెలుస్తోంది. ప్రధాని మోడీ, కేసీఆర్ సమావేశాన్ని తమకు అనుకూలంగా మలుచుకుని జనంలోకి వెళ్లాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.
http://www.teluguone.com/news/content/cm-kcr-meet-pm-narendra-modi-create-political-heat-in-telangana-39-122459.html





