డీఎస్సీపై దుష్ప్రచారం.. టీడీపీ శ్రేణులకు చంద్రబాబు కీలక సూచనలు..!
Publish Date:Aug 8, 2026
Advertisement
టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో యూనిట్ ఇంఛార్జ్‌లకు నిర్వహించిన శిక్షణా తరగతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలు, పార్టీ కార్యక్రమాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కార్యకర్తల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకే శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. పార్టీ భావజాలాన్ని అర్థం చేసుకుని.. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజలకు చెప్పకపోతే.. తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మే ప్రమాదం ఉందని అన్నారు. గొడ్డలి పార్టీ చేస్తున్న కుట్రలు, దుష్ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు. డీఎస్సీ పరీక్షల విషయంలోనూ దుష్ప్రచారం చేసేందుకు ప్రయత్నించారని.. అయితే వాస్తవాలను ప్రజలకు వివరించి గట్టిగా కౌంటర్ ఇవ్వగలిగామని చెప్పారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కు ఎవరికైనా ఉందని.. అయితే ప్రజలను ఇబ్బందులకు గురిచేసేలా చేసే నిరసనలను ఉపేక్షించబోమని చంద్రబాబు స్పష్టం చేశారు. కర్నూలులో జరిగిన నిరసనలను ప్రస్తావిస్తూ.. గొడ్డలి పార్టీ ఆందోళనల్లో రౌడీలు, గంజాయి బ్యాచ్‌లు తప్ప ఒక్క డీఎస్సీ అభ్యర్థి అయినా ఉన్నారా అని ప్రశ్నించారు. కర్నూలులో ఈరోజు ఆందోళనకు దిగిన వారంతా మెగా డీఎస్సీ-2025 ద్వారా ఎంపికైన టీచర్లేనని తెలిపారు.డీఎస్సీ పరీక్షల నిర్వహణలో ఎలాంటి తప్పిదాలు జరగలేదని స్పష్టంగా చెప్పగలిగామని.. అందుకే గొడ్డలి పార్టీ మినహా ఇతర పార్టీల నేతలు సైతం తప్పులు జరగలేదని బహిరంగంగా చెబుతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజలకు వివరించగలిగితే.. కుట్రలను ప్రజలే అడ్డుకుంటారని అన్నారు. మంచి పనులు చేస్తే ప్రజలు సహకరించి భాగస్వాములు అవుతారనడానికి భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవమే నిదర్శనమని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఇటీవలే ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చానని.. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వ్యవస్థలను గాడిలో పెట్టి సంక్షేమం, అభివృద్ధిని కొనసాగిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. సాధారణ కార్యకర్త అయినా.. పార్టీ అగ్రనాయకుడు అయినా పార్టీనే సుప్రీం అని స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గంలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నానని చెప్పారు. కార్యకర్తలను పట్టించుకోని వారిపై, పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై జీరో టాలరెన్స్ ఉంటుందని హెచ్చరించారు. గొడ్డలి పార్టీ రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని చంద్రబాబు అన్నారు. రాబోయే ప్రతి ఎన్నికల్లో ప్రతి బూత్‌లోనూ గత ఎన్నికల కంటే ఎక్కువ ఓట్లు సాధించేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకుల ప్రవర్తన ఓట్లపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. యూనిట్, క్లస్టర్ ఇంఛార్జ్‌లు, మండల అధ్యక్షులకు తగిన గౌరవం దక్కేలా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు తెలిపారు. CM Chandrababu,TDP,NTR Bhavan, TDP Central Office,TDP Training Programme, Mega DSC 2025, AP Politics, Minister naralokesh
http://www.teluguone.com/news/content/cm-chandrababu-39-228415.html





