న్యాయవ్యవస్థను కించపరిస్తే శిక్ష తప్పదు.. సీజేఐ హెచ్చరికతో వైసీపీలో గుబులు!
Publish Date:Jun 2, 2022
Advertisement
నేరుగా ఎవరినీ వేలెత్తి చూపకపోయినా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేసిన వ్యాఖ్యలు కచ్చితంగా జగన్ కు, జగన్ ప్రభుత్వానికీ, వైసీపీ నేతలకూ అతికినట్టు సరిపోతాయి. వ్యవస్థలు చక్కపెట్టుకోవడం చేతకాని వారే కోర్టులను తప్పుపడతారు అని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ విస్పష్టంగా చెప్పేశారు. ఈ మాట ఆయన తెలంగాణలో జిల్లా కోర్టులను గురువారం ప్రారంభించిన జస్టిస్ ఎన్వీ రమణ చేసిన జగన్, జగన్ సర్కార్ తీరుకు చెంపపెట్టు వంటివే. ఆయన ఇంకా న్యాయ వ్యవస్థ స్వార్థ పరుల కోసం కాదనీ, సమాజ శ్రేయస్సు కోసమేనని స్పష్టం చేశారు. అడ్డగోలు నిర్ణయాలు తీసుకోవడం, న్యాయస్థానాలలో చుక్కెదురైతే.. కోర్టులను, ఈ తీర్పులిచ్చిన న్యాయమూర్తుల ఉద్దేశాలనూ తప్పు పడుతూ వ్యాఖ్యలు చేయడం ఏపీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక అలవాటుగా మారిన నేపథ్యంలో తెలంగాణ గడ్డపై నుంచి సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.ఇటీవలి కాలంలో కోర్టు తీర్పులపై కొందరు వక్రభాష్యం చెబుతున్నారని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. మూడు రాజధానుల విషయంలో కోర్టు తీర్పును తప్పుపట్టడమే కాకుండా దానికి వక్రభాష్యం చెబుతూ ముఖ్యమంత్రి జగన్ సహా ఆయన కేబినెట్ లోకి కొందరు మంత్రులు మీడియా ఎదుట వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. సుప్రీం ను ఆశ్రయిస్తామనీ, చట్టాలు చేసే అధికారం ప్రభుత్వానికి లేదని కోర్టులు ఎలా చెబుతాయంటూ వారు చేసిన వ్యాఖ్యలపై అప్పట్లోనే తీవ్ర వ్యతిరేకత వచ్చిన సంగతి తెలిసిందే. వాస్తవానికి హైకోర్టు సీఆర్డీయే, భూములిచ్చిన రైతులకు న్యాయం అన్న విషయంపైనే తీర్పిచ్చింది. ఆ రెంటికీ విఘాదం కలిగే ఏ చట్టం చేయడానికైనా ప్రభుత్వానికి అధికారం లేదని స్పష్టం చేసింది. ముందుగా కుదుర్చుకున్న( అది గత ప్రభుత్వమైనా సరే) ఒప్పందం ప్రకారం రైతుల ప్రయోజనాలు రక్షించాలన్నదే కోర్టు తీర్పు సారాంశంగా న్యాయనిపుణులు అప్పట్లోనే స్పష్టం చేశారు. అయితే ముఖ్యమంత్రి సహా వైసీపీ మంత్రలు, నాయకులు మాత్రం కోర్టు తీర్పుపై పలు వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తులకు ఉద్దేశాలు ఆపాదించారు. అందుకే నేరుగా పేరు పెట్టి ప్రస్తావించకపోయినా ఆయన వ్యాఖ్యలు జగన్ సర్కార్ కు చెంప పెట్టులాంటివేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అంతే కాకుండా న్యాయ వ్యవస్థను కించ పరిచే వారికి, న్యాయ వ్యవస్థపై అభాండాలు వేసే వారికీ శిక్ష తప్పదని కూడా భారత ప్రధాన న్యాయ మూర్తి హెచ్చరించారు. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి గతంలో కాబోయే చీఫ్ జస్టిస్ (జస్టిస్ ఎన్వీ రమణ)పై నిందలు వేసి.. అప్పటికీ సీజేఐకి లేఖ రాయడమే కాకుండా తప్పుడుపని అని తెలిసినా మీడియాకు విడుదల చేసిన విషయం ప్రస్తావనార్హం, ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులపై అభాండాలు వేసి పైశాచికానందం పొందేవారిని ఉపేక్షించడం రాజ్యాంగ విరుద్ధమని సీజేఐ హెచ్చరిక ప్రాధాన్యత సంతరించుకుందనడంలో సందేహం లేదు. ఏది ఏమైనా తెలంగాణ గడ్డపై నుంచి సీజేఐ చేసిన వ్యాఖ్యలు ఏపీలో కలకలం సృష్టిస్తున్నాయి. సీజేఐ ఏ తీరును అయితే విమర్శించారో సరిగ్గా ఏపీ ప్రభుత్వం, ఏపీ ముఖ్యమంత్రి తీరు అలాగే ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు.
http://www.teluguone.com/news/content/cji-caution-on-criticising-courts-25-136933.html





