అమిత్ షాతో చిరు, రామ్ చరణ్ భేటీ: ఏం మాట్లాడారంటే.?
Publish Date:Nov 2, 2026
Advertisement
సమాజంలో సాంకేతికత పెరుగుతూ రోజు రోజుకూ కొత్త ఎత్తులకు విస్తరిస్తున్నది. అయితే ఆ సాంకేతికతను దుర్వినియోగం చేయడం కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. ముఖ్యంగా కృత్రిమ మేధస్సు సాంకేతికతను అసాంఘిక శక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తూ ప్రముఖుల వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారు. ఈ తీవ్రమైన సమస్యను పరిష్కరించాలని కోరుతూ సినీ పరిశ్రమ తరఫున మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను వారిరువురూ బేగంపేటలో ఐటీసీ కాకతీయ హోటల్లో సోమవారం (నవంబర్ 2)న కలిశారు. ఈ సందర్భంగా వారు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సైబర్ సవాళ్ల ను వివరించారు. ప్రధానంగా ఏఐ టెక్నాలజీ దుర్వినియోగం, డీప్ ఫేక్, మార్ఫింగ్ ద్వారా సినీ ప్రముఖుల ఫొటోలు, వీడియోలను అసభ్యకరంగా, అనుచిత రీతిలో అభ్యంతరకరంగా సామాజిక మాధ్యమంలో ప్రచారం చేస్తున్నారని ఈ సందర్భంగా చిరంజీవి అమిత్ షాకు తెలిపారు. ముఖ్యంగా నటీమణులు, ప్రముఖ కుటుంబాల వ్యక్తులు దీనివల్ల తీవ్ర మానసిక ఆందోళనకు, అవమానాలకు గురవుతున్నారని ఆయన కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. టాలీవుడ్‌తో పాటు యావత్ భారత సినీ పరిశ్రమ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని, సైబర్ ఉన్మాదులకు అడ్డుకట్ట వేసేలా కేంద్ర ప్రభుత్వం వెంటనే కఠినమైన చట్టాలు, మార్గదర్శకాలు రూపొందించాలని చిరంజీవి విజ్ఞప్తి చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ సమాజంలో విద్వేషం, మానసిక క్షోభ కలిగించే వ్యక్తులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకునేలా సైబర్ నిఘా వ్యవస్థను బలోపేతం చేయాలని చిరంజీవి కోరారు. డిజిటల్ రంగంలో మహిళల గౌరవానికి, వ్యక్తుల ప్రతిష్ఠకు భంగం కలిగించే చర్యలను ఏమాత్రం సహించేది లేదని అమిత్ షా ఈ సందర్భంగా అన్నారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించి, కఠిన చట్టాలను అమలు చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటుందని ఆయన చిరంజీవి, రామ్ చరణ్ కు హామీ ఇచ్చారు. ఈ వినతిపై మరింత సమగ్ర అధ్యయనం చేసేందుకు వీలుగా, పూర్తి వివరాలతో కూడిన లిఖితపూర్వక వినతిపత్రాన్ని సమర్పించాలని చిరంజీవికి అమిత్ షా సూచించారు. ఈ ప్రక్రియకు సంబంధించి కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డిని సమన్వయకర్తగా నియమిస్తూ, ఆయన ద్వారా సమగ్ర వివరాలను కేంద్ర హోంశాఖకు అందజేయాలని కోరారు.కేంద్ర ప్రభుత్వం నుంచి లభించిన సానుకూల స్పందనపై చిరంజీవి, రామ్ చరణ్ తీవ్ర సంతృప్తి వ్యక్తం చేశారు. ఏఐ దుర్వినియోగానికి వ్యతిరేకంగా కేంద్రం తీసుకోబోయే దృఢమైన నిర్ణయాలు యావత్ సినీ పరిశ్రమకు, సైబర్ బాధితులకు గొప్ప ఊరటనిస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా అమిత్ షా తో తమ భేటీపై సామాజిక మాధ్యమ వేదికగా స్పందించిన చిరంజీవి, రామ్ చరణ్.. తాము ప్రస్తావించిన సమస్యను సత్వరమే పరిష్కరిస్తామంటూ అమిష్ షా స్పష్టమైన హామీ ఇచ్చారనీ, ఆయన సానుకూలంగా స్పందించారనీ పేర్కొన్నారు. ఏఐ, డీప్‌ఫేక్ అడ్డగోలు దుర్వినియోగం వల్ల నటీనటులు, కళాకారుల వ్యక్తిగత హక్కులు, గౌరవానికి భంగం వాటిల్లుతోందని తాను ఆయనకు వివరించినట్లు తెలిపారు. సమస్య యొక్క తీవ్రతను అర్థం చేసుకున్న అమిత్ షా.. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే దృష్టి సారిస్తుందని, కళాకారులు, సామాన్యులకు రక్షణ కల్పించేలా కఠిన నిబంధనలు తీసుకువస్తామనీ, సాంకేతికతను దుర్వినియోగం చేసే వారిని చట్టపరంగా శిక్షిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారని పేర్కొన్నారు. [Chiranjeevi Ram Charan Meet Amit Shah, AI, Doopfake, Misuse, Control, Telugu One]
http://www.teluguone.com/news/content/chiranjeevi-ram-charan-meet-amit-shah-36-236100.html




