రక్షణ కవచాలే రాబందులు.. చైనా ఆర్థిక పతనం ప్రభావం!
Publish Date:Apr 18, 2026
Advertisement
ప్రస్తుతం చైనా ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితి కేవలం దేశ జీడీపీ వృద్ధి రేటు పడిపోవడానికో లేదా రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలడానికో పరిమితం కాలేదు. ఇది ఒక వ్యవస్థాత్మక వైఫల్యం. అధికారిక గణాంకాలు అభివృద్ధిని సూచిస్తున్నా, క్షేత్రస్థాయిలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు వాస్తవ పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నయో అద్ధం పడుతున్నాయి. ప్రజలకు అండగా ఉండాల్సిన బ్యాంకులు, ఆసుపత్రులు, ప్రభుత్వ రంగాలు ఇప్పుడు వాటి అస్థిత్వం కోసం సామాన్యుడిని ఆర్థికంగా వేధించే యంత్రాలుగా.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే రాబందులుగా మారుతున్నాయనే వాస్తవాన్ని కళ్లకు కడుతున్నాయి. ముఖ్యంగా ఆరోగ్య రంగం తీవ్రమైన సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. కోవిడ్ అనంతర పరిస్థితుల్లో వైద్య సేవలకు విపరీతమైన డిమాండ్ ఉన్నప్పటికీ.. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు భారీగా మూతపడుతున్నాయి. మూడేళ్లుగా సాగిన లాక్ డౌన్ లు, కఠిన పరీక్షల వల్ల మెడికల్ ఇన్సూరెన్స్ నిధులు అడుగంటిపోయాయి. దీంతో ఆసుపత్రులకు రావాల్సిన బకాయిలు నిలిచిపోయి, డాక్టర్ల జీతాల్లో కోతలు విధిస్తూ సేవలను నిలిపివేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలు వలస వెళ్లడం, జనాభా తగ్గుదల వంటి కారణాలతో చిన్న స్థాయి వైద్యశాలలు దివాళా తీస్తున్నాయి. బ్యాంకింగ్ రంగంలో కూడా ప్రజల నమ్మకం సడలిపోతోంది. తన సొంత డబ్బును విత్‌డ్రా చేసుకోవాలన్నా ప్రజలు అనేక విచారణలను ఎదుర్కోవాల్సి వస్తోంది. యాంటీ-ఫ్రాడ్ తనిఖీల పేరుతో డిపాజిటర్లను ఇబ్బంది పెడుతూ.. బ్యాంకుల్లో ప్రజలు దాచుకున్న సొమ్మును తిరిగి చెల్లించడానికి ప్రభుత్వం నిరాకరిస్తోంది. వందల కొద్దీ బ్యాంకు శాఖలు మూతపడ్డాయి. దీంతో ప్రజల పొదుపు మొత్తాలు రిస్కీ పెట్టుబడులకు మళ్లాయనే ఆరోపణలు వస్తున్నాయి. రక్షణగా ఉండాల్సిన ఆర్థిక సంస్థలే ఇప్పుడు డిపాజిటర్లకు శత్రువులుగా మారిన పరిస్థితి. మతపరమైన ఆధ్యాత్మిక కేంద్రాలు సైతం ప్రభుత్వానికి రాబడి మార్గాలుగా మారిపోయాయి. షావోలిన్ వంటి చారిత్రాత్మక ఆలయాలపై సాయుధ బలగాల నిఘా పెరిగింది. ఇప్పటికే వందలాది ఆలయాలను మూసివేసిన ప్రభుత్వం, వాటి ద్వారా వచ్చే విరాళాలను, పర్యాటక ఆదాయాన్ని నేరుగా ప్రభుత్వ ఖజానాకు తరలిస్తోంది. ఆధ్యాత్మిక శాంతి దొరకాల్సిన ప్రదేశాలను సైతం చైనా ప్రభుత్వం కేవలం ఆదాయం పిండుకునే ఏటీఎం లుగా వాడుకుంటోంది. ఉపాధి రంగంలో పరిస్థితులు మరింత అధ్వానంగా తయారయ్యాయి. చిన్న నగరాల్లో జీతాలు దాదాపు మూడు దశాబ్దాల కిందటి స్థాయికి పడిపోయాయి. మరోవైపు.. పేకింగ్ యూనివర్సిటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థల నుంచి పీహెచ్‌డీ పట్టాలు పొందిన యువత కూడా తక్కువ జీతం ఉన్నా సరే ప్రభుత్వ భద్రత ఉంటుందనే ఆశతో చిన్న స్థాయి ఉద్యోగాల కోసం పోటీ పడుతున్నారు. ప్రైవేట్ టెక్ రంగం, రియల్ ఎస్టేట్ రంగాలు బలహీనపడటంతో యువతలో భవిష్యత్తుపై అభద్రతా భావం పెరిగిపోయింది. గంటల కొద్దీ శ్రమించినా కనీస అవసరాలు తీరని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో సైతం నెలల తరబడి జీతాలు అందడం లేదంటే పరిస్థితి తీవ్రత అవగతమౌతుంది. బీజింగ్‌లోని కీలక సెక్యూరిటీ సంస్థల్లో కూడా వేల సంఖ్యలో ఉద్యోగుల జీతాలు బకాయిలుగా ఉన్నాయి. దాదాపు రెండేళ్లుగా వేతనాలు అందని పరిస్థితి ఉందంటే పరిస్థితి తీవ్రత ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఈ ఆర్థిక ఒత్తిడి ఎంతలా ఉందంటే.. రైల్వే స్టేషన్లలో సెక్యూరిటీ గార్డులుగా పనిచేసేందుకు కూడా మధ్యవర్తులకు భారీ మొత్తంలో లంచాలు ఇచ్చి మరీ వాటిని ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. కేవలం ఒక యూనిఫాం, సిస్టమ్ లోపల ఉన్నామనే భ్రమ కోసం పేదరికాన్ని సైతం వారు ఆహ్వానిస్తున్నారు. గిగ్ ఎకానమీ, నిరాశ్రయుల సంఖ్యలో కనిపిస్తున్న పెరుగుదల భవిష్యత్తు సవాళ్లు ఏమిటో చెబుతోంది. ఫుడ్ డెలివరీ చేసే కార్మికుల ఆదాయం విపరీతంగా తగ్గిపోగా, దేశంలో నిరాశ్రయుల సంఖ్య 4.7 కోట్లకు చేరుకుంది. ఇందులో 60 శాతానికి పైగా 33 ఏళ్ల లోపు యువతే కావడం విశేషం. పెద్ద నగరాల్లో భోజనం కోసం క్యూలో నిలుచుంటున్న నిరాశ్రయులైన యువతను చూస్తుంటే చైనాలో సామాజిక భద్రతా వలయం పూర్తిగా విచ్ఛిన్నమైందని స్పష్టమవుతోంది. దేశం బయట కూడా చైనా పౌరులకు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇజ్రాయెల్ వంటి యుద్ధ ప్రాంతాల్లో పని చేస్తున్న చైనీయులు, తమ దేశానికి తిరిగి వస్తే ఉపాధి దొరకదనే భయంతో అక్కడే ఉండటానికే మొగ్గు చూపుతున్నారు. విదేశాలకు వెళ్లే మార్గాలు కూడా ఖరీదైనవిగా మారడం తో ప్రజలు దేశంలోనే ఇరుక్కుపోయారు. మొత్తానికి, ప్రజల రిస్కును తగ్గించాల్సిన వ్యవస్థలే ఇప్పుడు ఆ భారాన్ని జనంపైకి నెట్టేస్తూ వారిని ఆర్థికంగా పీల్చి పిప్పి చేస్తున్నాయి. భవిష్యత్తు ఉందనే ఆశ కంటే అవకాశాలు ముగిసిపోతున్నాయనే భయమే ఇప్పుడు చైనా అంతటా తాండవిస్తోంది. -సీతారాం కంఠమనేని
http://www.teluguone.com/news/content/chinas-economic-crisis-36-217679.html





