చిన్నారి చావుకు మంత్రే కారణం!.. చావు డప్పులో సంబరాలా? చంద్రబాబు ఫైర్
Publish Date:Apr 16, 2022
Advertisement
చిన్న కామన్ సెన్స్. అంబులెన్స్ వస్తుంటే.. పెద్ద పెద్ద వారే పక్కకు జరిగి దారి ఇస్తుంటారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు నుంచి సీఎం జగన్ వరకూ చాలామంది పద్దతిగా నడుచుకున్నారు. కానీ, కొత్తగా మంత్రి అయ్యాననే అహంకారమో ఏమో.. కల్యాణదుర్గంలో ఉషశ్రీ చరణ్ ర్యాలీలో ట్రాఫిక్‌ను స్థంభింపజేశారు. ఆ ట్రాఫిక్‌లో ఓ ఎమర్జెన్సీ వాహనం చిక్కుకుపోయింది. అందులో 7 నెలల చిన్నారి తీవ్ర అనారోగ్యంతో ఉంది. ఆ పాపాయిని ఆసుపత్రికి తీసుకెళుతున్నారు. కానీ, మంత్రి గారి ర్యాలీ అంటూ వారి వాహనం ముందుకు వెళ్లేందుకు ఛాన్స్ ఇవ్వలేదు పోలీసులు. అప్పటికే ఆ చిన్నారి పరిస్థితి విషమించింది. వైసీపీ నాయకులను ఎంతగా బతిమిలాడుకున్నా.. వారి వెహికిల్‌కు దారి ఇవ్వలేదు. దీంతో, సమయానికి హాస్పిటల్‌కి వెళ్లలేక పోవడంతో ఆ చిన్నారికి 7 నెలల వయసులోనే నిండు నూరేళ్లు నిండిపోయాయి. మంత్రి గారి సంబరాల ర్యాలీ వల్ల.. ఓ పసికందు ప్రాణం పోయింది. సకాలంలో వైద్యం అందక చిన్నారి మృతి చెందిందంటూ కుటుంబీకులు ఘటనా ప్రదేశంలోనే ఆందోళన కూడా చేశారు. ఆందోళన చేస్తున్న చిన్నారి కుటుంబీకులను పట్టించుకోకుండా ఉషశ్రీ వెళ్లిపోయారు. ఇప్పటికీ బాధిత కుటుంబాన్ని మంత్రి పరామర్శించలేదు. ఘటనపై సర్వత్రా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మంత్రి ఉషశ్రీ చరణ్, అనుచరులు, వైసీపీ శ్రేణులపై మండిపడుతున్నారు ప్రజానీకం. కళ్యాణ దుర్గంలో పసిపాప మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్విటర్‌లో స్పందించారు. మంత్రి ఆర్భాటం కోసం పసిబిడ్డ ప్రాణాలు పోవడం తీవ్రంగా కలచివేసిందన్నారు. ప్రభుత్వంలోని వ్యక్తుల సంబరాల కోసం ట్రాఫిక్ నిలిపివేసి పసిపాప చనిపోడానికి కారణం అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాపాయంలో ఉన్న చిన్నారి ఆసుపత్రికి వెళ్లడం కంటే మంత్రుల ర్యాలీలే ముఖ్యమని భావించడం దారుణమన్నారు. అర్థం లేని ఆంక్షలతో చిన్నారి మృతికి కారణం అయిన పోలీసులు ఇప్పుడు ఏం చెపుతారు? చావు డప్పులో పదవీ సంబరాలు జరుపుకున్న మంత్రి.. ఆ తల్లిదండ్రుల కడుపు కోతకు ఏం సమాధానం చెబుతారు? అని ప్రశ్నించారు చంద్రబాబు.
http://www.teluguone.com/news/content/child-ded-in-minister-ushasri-charan-rally-25-134473.html





