విశాఖలో గూగుల్ డేటా సెంటర్.. రేపు చంద్రబాబు శంకుస్థాపన
Publish Date:Apr 27, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ ను సాంకేతిక పరిజ్ఞానంలో అగ్రపథాన నిలపాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్న కూటమి ప్రభుత్వం ఆ దిశగా కీలకమైలు రాయిని చేరుకుంది. ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ తన ప్రతిష్టాత్మక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) డేటా సెంటర్‌ను విశాఖపట్నంలో ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. ఈ మెగా ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం (ఏప్రిల్ 28) శంకుస్థాపన చేయనున్నారు. ఈ పరిణామంతో విశాఖ నగరం అంతర్జాతీయ ఐటీ మ్యాప్‌లో అత్యంత కీలకమైన కేంద్రంగా నిలవనుంది. విశాఖ జిల్లా తర్లువాడ సమీపంలో ఈ భారీ డేటా సెంటర్ నిర్మాణం కానుంది. 15 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో 1.25 లక్షల కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతోంది. దేశ చరిత్రలోనే ఇది అత్యంత భారీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో ఒకటి. ఒక గిగావాట్ సామర్థ్యంతో నిర్మితమయ్యే ఈ హైపర్ స్కేల్ డేటా సెంటర్, కేవలం ఒక కార్యాలయంలా కాకుండా ఆసియా ఖండానికే ఏఐ సేవలకు ప్రధాన ద్వారంగా అంటే గేట్ వేగా ఉంటుంది. ఈ ప్రాజెక్టు విస్తరణ కోసం తర్లువాడ, అడవివరం, రాంబిల్లి ప్రాంతాల్లో 600 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. గూగుల్ భాగస్వామ్యంతో పాటు అదానీ కనెక్ట్స్, ఎయిర్‌టెల్ నెక్స్‌ట్రా వంటి దిగ్గజ సంస్థలు కూడా ఈ డిజిటల్ ఎకోసిస్టమ్ నిర్మాణంలో పాలుపంచుకుంటున్నాయి. రాష్ట్రంలో సుమారు 6.5 గిగావాట్ల సామర్థ్యంతో మల్టీ గిగావాట్ డిజిటల్ హబ్‌ను అభివృద్ధి చేయాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి లక్ష్యం. ఈ దిశగా గూగుల్ రాక తొలి మెట్టుగా చెప్పవచ్చు. గతంలో హైటెక్ సిటీ నిర్మాణంతో హైదరాబాద్ రూపురేఖలు మార్చిన చంద్రబాబు.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే తరహా ఐటీ విప్లవాన్ని విశాఖ వేదికగా ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం కారణంగానే గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నాయనడంలో సందేహం లేదు. విశాఖ తీరంలో అందుబాటులోకి రానున్న సబ్-సీ కేబుల్ వ్యవస్థ ఈ డేటా సెంటర్ల నిర్వహణకు అత్యంత అనుకూలంగా మారనుంది. ఈ భారీ పరిశ్రమ ద్వారా రాష్ట్ర యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ వంటి అత్యాధునిక రంగాల్లో వేలాది నిపుణులకు ఉపాధి దొరుకుతుంది. నేరుగా లభించే ఉద్యోగాలతో పాటు అనుబంధ రంగాలైన సర్వర్ తయారీ, కూలింగ్ టెక్నాలజీ, నెట్‌వర్కింగ్ వంటి విభాగాల్లో కూడా పరోక్షంగా వేలాది మందికి లబ్ధి చేకూరనుంది. రాబోయే రోజుల్లో విశాఖపట్నం కేవలం పోర్టు సిటీగానే కాకుండా డేటా సిటీ గా గుర్తింపు పొందనుంది. గూగుల్ రాకతో ఇతర గ్లోబల్ స్టార్టప్‌లు, సెమీకండక్టర్ కంపెనీలు కూడా విశాఖ వైపు చూసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన గ్రీన్ ఎనర్జీ సరఫరాకు ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తయితే, అంతర్జాతీయ స్థాయిలో రవాణా సౌకర్యాలు మరింత మెరుగై విశాఖ ఐటీ రంగం పరుగులు తీస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/chandrababu-to-lay-foundation-stone-for-google-datacenter-36-218333.html





