28మంది వైసీపీ ఎంపీలు ఏం సాధించారు? బడ్జెట్‌పై చంద్రబాబు రియాక్షన్..
Publish Date:Feb 1, 2022
Advertisement
కేంద్ర బడ్జెట్ ఆశాజనకంగా లేదని టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు మండిపడ్డారు. రైతులకు ఎలాంటి మేలు జరగదని.. పంటలకు మద్దతు ధర విషయంలో ఎటువంటి సానుకూల నిర్ణయాలు లేవకపోవడం బాధాకరం అన్నారు. పేద వర్గాలు, కొవిడ్‌తో దెబ్బతిన్న రంగాలకు ఎటువంటి చేయూత ఇస్తారో బడ్జెట్‌లో చెప్పలేదన్నారు. జాతీయ ఆహార భద్రత పథకంలో కేంద్రం తన బాధ్యత నుంచి తప్పుకునే ప్రయత్నం చెయ్యడం సరికాదని చంద్రబాబు అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పేదలకు భారంగా మారిన పరిస్థితుల్లో వాటిని తగ్గించేందుకు ఎటువంటి చర్యలను ప్రకటించకపోవడాన్ని తప్పు పట్టారు చంద్రబాబు. సంస్కరణల విషయంలో కేంద్రం తీసుకున్నకొన్ని నిర్ణయాలను మాత్రం చంద్రబాబు స్వాగతించారు. నదుల అనుసంధానం విషయంలో కేంద్ర ప్రతిపాదనలను స్వాగతించారు. టీడీపీ హయాంలో కృష్ణా - గోదావరి నదుల అనుసంధానం చేయడం ద్వారా ఏడేళ్ల క్రితమే ఈ ప్రక్రియకు తాము నాంది పలికామని అన్నారు. టిడిపి హయాంలో కృష్ణా - గోదావరి -పెన్నా నదుల అనుసంధానంపై ప్రణాళికలు కూడా సిద్దం చేశామని గుర్తు చేశారు. ఇప్పటికైనా నదుల అనుసంధానంపై కేంద్రం ముందడుగు వెయ్యడాన్ని చంద్రబాబు స్వాగతించారు. విద్యుత్ వాహనాలను ప్రోత్సహించేందుకు ప్రవేశపెట్టిన నూతన విధానాన్ని చంద్రబాబు ఆహ్వానించారు. గతంలో దేశంలో మొట్టమొదటి సారిగా ఎలక్ట్రికల్ వెహికిల్ పాలసీని తెచ్చామన్నారు. డిజిటల్ లావాదేవీలు, డిజిటల్ కరెన్సీ విషయంలో కేంద్ర ప్రతిపాదనలు మంచి నిర్ణయాలని చంద్రబాబు అన్నారు. సోలార్ రంగాన్ని ప్రోత్సహించడానికి కేంద్రం ముందుకు రావడం సముచితం అన్నారు. ఏపీ ప్రయోజనాల విషయంలో వైసిపి ప్రభుత్వం మరోసారి పూర్తిగా విఫలం అయ్యిందన్నారు టీడీపీ అధినేత. 28 మంది ఎంపిలు ఉండి ఏం సాధించారని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రాజెక్టులు, నిధుల కేటాయింపుల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవడంలో పూర్తిగా సిఎం జగన్ విఫలం అయ్యారని విమర్శించారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తరవాత ఇప్పటికి కేంద్రం నాలుగు బడ్జెట్ లు ప్రవేశ పెట్టినా.. 28 మంది ఎంపిలు ఉండి రాష్ట్రానికి ఏమీ సాధించలేదని అన్నారు. వైసిపి ఎంపిలకు సొంత ప్రయోజనాలపై తప్ప రాష్ట్ర ప్రయోజనాలపై శ్రద్ద లేదని టిడిపి అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
http://www.teluguone.com/news/content/chandrababu-reaction-on-budget-39-131079.html





