పవిత్ర సంగమంలో చంద్రబాబు జలహారతి.. ప్రత్యేక పూజలు.!
Publish Date:Jul 15, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ పవిత్ర సంగమ క్షేత్రంలో పర్యటించారు. కృష్ణా, గోదావరి నదుల పవిత్ర కలయికకు నిలయమైన ఇబ్రహీంపట్నం వద్ద గల పవిత్ర సంగమ ఘాట్‌లో నదీ దేవతలకు ఆయన వైభవంగా జలహారతి ఇచ్చారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిని ఆకాంక్షిస్తూ, ప్రజలందరూ సుఖసంతోషాలతో విలసిల్లాలని కోరుకుంటూ సిఎం ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పవిత్ర సంగమ ప్రాంతాన్ని సుందరంగా అలంకరించారు. స్థానిక అర్చకులు, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సిఎం చంద్రబాబుకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం శాస్త్రోక్తంగా నిర్వహించిన జల పూజలో ముఖ్యమంత్రి పాల్గొని, కృష్ణవేణి, సప్త గోదావరి దేవతలకు నీరాజనాలు సమర్పించారు. ఈ సందర్భంగా పండితులు వేద ఆశీర్వచనాలు అందించి, సిఎంకు తీర్థప్రసాదాలు అందజేశారు. పూజా కార్యక్రమాల అనంతరం ముఖ్యమంత్రి పవిత్ర సంగమ పరిసరాలను పరిశీలించారు. గత పాలకుల హయాంలో ఈ ఘాట్ నిర్లక్ష్యానికి గురైందని, దీని పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో అంటే 2014, 19 మధ్య కాలంలో పవిత్ర సంగమం వద్ద ప్రతిరోజూ జలహారతి కార్యక్రమం వైభవంగా సాగేదని, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చేవారని సిఎం గుర్తు చేశారు. పర్యాటకంగా, ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన ఈ ప్రాంతాన్ని మళ్లీ అభివృద్ధి పథంలోకి తీసుకువస్తామన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఇక్కడి మౌలిక వసతులను మరింత మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. ఘాట్ పరిసరాల్లో భక్తులకు కనీస సౌకర్యాల కల్పనతో పాటు, రవాణా ఇబ్బందులు లేకుండా చూసేందుకు వీలుగా రోడ్డు కనెక్టివిటీ పనులను వెంటనే చేపట్టాలని చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. నదీ జలాల సంరక్షణ, నదుల అనుసంధానంపై తమ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను సిఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు. జలహారతి వంటి కార్యక్రమాల ద్వారా ప్రకృతిని గౌరవించుకోవడమే కాకుండా, భవిష్యత్ తరాలకు జల సంరక్షణపై అవగాహన కల్పించవచ్చన్నారు. Pavitra Sangamam Jalaharati, Andhra Pradesh spiritual tourism, Ibrahimpatnam Pavitra Sangamam Ghat
http://www.teluguone.com/news/content/chandrababu-performs--jalaharathi-36-226076.html





