జిల్లాల పర్యటన ముగించుకుని వారం తరువాత అమరావతి చేరుకున్న చంద్రబాబు.!
Publish Date:Jul 6, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన వారం రోజుల జిల్లాల పర్యటన పూర్తి చేసుకుని అమరావతికి తిరిగి వచ్చారు. వారం రోజుల పాటు నాలుగు జిల్లాలలో సుడిగాలి పర్యటనలు చేసిన చంద్రబాబునాయుడు.. ఈ సందర్భంగా పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. అలాగే వేల కోట్ల రూపాయల పారిశ్రామిక పెట్టుబడులకు అంకురార్పణ చేశారు. నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు జిల్లాల్లో సీబీఎన్ సాగించిన ఈ పర్యటన.. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు తెలుసుకుంటూనే.. రాష్ట్ర భవిష్యత్తుకు భరోసానిచ్చే పలు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ఈ పర్యటనలో భాగంగా నెల్లూరు జిల్లాలో పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. జిల్లాలో త్వరలోనే భారీ మెగా ఫర్నిచర్ పార్కును ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించిన ఆయన అలాగే.. దశాబ్దాలుగా నలుగుతున్న వెలిగొండ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి సాగు, తాగు నీరందిస్తామని ప్రజలకు స్పష్టమైన హామీ ఇచ్చారు. ఇక తిరుపతి జిల్లా సత్యవేడులో పర్యటించి.. ప్రఖ్యాత హీరో మోటార్స్ సంస్థకు చెందిన గ్లోబల్ పార్ట్స్ సెంటర్‌కు శంకుస్థాపన చేశారు. రైల్వేకోడూరులో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో కలిసి జాతీయ స్థాయి కేంద్ర ప్రభుత్వ పథకం వీబీ జీ రామ్ జీ ని ఘనంగా ప్రారంభించారు. తిరుపతిలో జరిగిన ఎకనమిక్ ఇంటెలిజెన్స్ ఫర్ గవర్నెన్స్ వర్క్‌షాప్‌లో పాల్గొని, భవిష్యత్ పాలనలో డేటా అనలిటిక్స్, డేటా ఆధారిత నిర్ణయాల ప్రాముఖ్యతను స్పష్టంగా వివరించారు. ఇక కడప జిల్లా సున్నపురాళ్లపల్లిలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం చేశారు. 16 వేల350 కోట్లరూపాయల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ ఉక్కు కర్మాగారంతో పాటు దానికి అనుబంధంగా రాబోయే గ్రీన్ ఎనర్జీ సోలార్ పవర్ ప్రాజెక్టు పనులను కూడా ఆయన ప్రారంభించారు. చివరిగా తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో మూడు రోజుల పాటు బస చేసిన చంద్రబాబు.. స్వర్ణ కుప్పం–పెట్టుబడుల వేదిక' కార్యక్రమంలో 9 వేల 322 కోట్ల విలువైన 30కి పైగా ప్రాజెక్టులకు సంబంధించిన కీలక ఒప్పందాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇందులో గ్లోబల్ బ్రాండ్ అడిడాస్ ఫుట్‌వేర్, నుంచి పారిశ్రామిక విమానాల తయారీ ప్రాజెక్టు వరకు భిన్న పరిశ్రమలు ఉన్నాయి. వీటి ద్వారా సుమారు 40 వేల మందికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. అలాగే.. 118 కోట్ల రూపాయలతో అత్యాధునిక మోడల్ బస్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అదే విధంగా.. ఆరు దశాబ్దాలుగా రైతులను వేధిస్తున్న కంగుంది భూ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి పట్టాలు పంపిణీ చేశారు. కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, డయాలసిస్ సెంటర్లను ప్రారంభించారు. AP CM District Tour, Swarna Kuppam Investments, JSW Rayalaseema Steel Plant, AP Economic Regions, Andhra Pradesh News
http://www.teluguone.com/news/content/chandrababu-concluded-districts-tour-36-225142.html





