జగన్ అహంకారం అణిగే రోజు దగ్గర్లోనే ఉంది
Publish Date:Feb 3, 2022
Advertisement
ఉద్యోగుల విషయంలో జగన్ సర్కారు అనుసరిస్తున్న తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల ముందస్తు అరెస్టులు దుర్మార్గం అన్నారు. ఉద్యోగుల నిరసనలపై గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇలా నియంతృత్వంగా వ్యవహరించలేదన్నారు. పిఆర్ సి విషయంలో ప్రభుత్వం చేసిన మోసంపై నిరసన తెలిపే హక్కు ఉద్యోగులకు లేదా అని ప్రశ్నించారు. శాంతియుత నిరసనలకు వస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సంఘాల ప్రతినిధులను తీవ్రవాదుల్లా అరెస్టులు చేసిన తీరుపై మండిపడ్డారు. వారు రాష్ట్ర ప్రజలు కాదా.. రాష్ట్రంలో భాగస్వాములు కాదా అని నిలదీశారు. పాఠశాలల వద్ద పోలీసు పహారా పెట్టి ఉపాధ్యాయులను నిర్భందించడం... విద్యార్థుల ముందు టీచర్లను అవమానించడమేనన్నారు. లక్షల మంది సమస్యపై ప్రభుత్వం అహంకారంతో కాకుండా ఆలోచనతో వ్యవహరించాలని హితవు పలికారు. జగన్ విశ్వసనీయతపై కడుపుమండిన ఉద్యోగులు అడిగిన ప్రశ్నలకు సిఎం సమాధానం చెప్పాలన్నారు. ప్రతి సందర్భంలో ఉద్యోగులను అవమానించే విధంగా సిఎం జగన్ ప్రవర్తించడం వల్లే ఈ స్థాయి నిరసనలు జరిగాయన్నారు. మాయ మాటలతో ప్రజలను, ఉద్యోగులను మోసం చేసి అధికారంలోకి వచ్చిన జగన్... ఇప్పుడు అంకెల గారడీతో జీతాలు తగ్గించలేదంటూ మళ్లీ మోసం చేస్తున్నారన్నారు. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో, తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నా తాము 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చామని... కానీ జగన్ సర్కార్ ఐఆర్ కంటే తక్కువ ఫిట్మెంట్ ఇచ్చి జీతాలు రికవరీ చెయ్యడం దేశంలోనే ఇప్పటివరకు జరగలేదన్నారు. ఉద్యోగులు కొత్త పీఆర్సీ వద్దు.. పాత జీతమే ఇవ్వండి అంటున్నారంటే.. ప్రభుత్వం ఎలా మోసం చేసిందో అర్థం అవుతుందన్నారు. ప్రభుత్వం భేషజాలు పక్కన పెట్టి... ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరారు.
http://www.teluguone.com/news/content/chandrababu-came-on-heavily-on-jagan-39-131217.html





