చంద్రబాబు యాత్రకి బ్రేకులే బ్రేకులు
Publish Date:Aug 30, 2013
Advertisement
చంద్రబాబు క్రిందటి ఆదివారం విజయనగరం జిల్లా నుండి చేప్పట్టాలనుకొన్నఆత్మగౌరవ యాత్రను తెదేపా నేతల సూచన మేరకు వాయిదా వేసుకొన్నారు. మళ్ళీ ఇప్పుడు వచ్చేనెల 1న గుంటూరు జిల్లా నుండి యాత్రకు సిద్దమవుతుంటే తెదేపా నేత పయ్యావుల కేశవ్ ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన యాత్ర చెప్పటడం అంత మంచిదికాదని సూచించారు. ఏపి.ఎన్.జి.ఓ సంఘ అద్యక్షుడు అశోక్ బాబు కూడా ఆయనకు అదేవిధంగా సలహా ఇచ్చారు. రాష్ట్ర విభజనకు అంగీకరిస్తూ ఆయన ఏవిధంగా లేఖ ఇచ్చారో, అదేవిధంగా ఇప్పుడు సమైక్యాంధ్ర కోరుతూ ఒక లేఖ ఇచ్చి యాత్ర మొదలుపెడితే ఆయనకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని సలహా ఇచ్చారు. విభజనకు అనుమతించిన చంద్రబాబు ఇప్పుడు ఆత్మగౌరవం గురించి మాట్లాడటం అనుచితమని అశోక్ బాబు అన్నారు. సీమాంధ్ర ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న ఈ సమయంలో ఆయన యాత్ర చేప్పటడం అంత మంచిది కాదని, అందువల్ల యాత్ర విరమించుకోవడం మేలని చంద్రబాబుకి సలహా ఇచ్చారు. ఈ పరిస్థితులు అన్నితెలిసి యాత్రకు బయలుదేరదలిస్తే, అందుకు సిద్దపడే రావడం మేలని సలహా ఇచ్చారు. ఆయన ఇప్పటికీ రాష్ట్ర విభజనకే మొగ్గు చూపుతునట్లయితే, రానున్న ఎన్నికలలో ప్రజలే తగిన గుణపాఠం చెపుతారని అశోక్ బాబు అన్నారు. ఈవిధంగా ఒకరి తరువాత మరొకరు చంద్రబాబు యాత్రను వ్యతిరేఖిస్తుండటంతో అసలు ఆయన యాత్ర మొదలుపెడతారా లేదా అనే విషయంపై పార్టీ శ్రేణులలో కూడా సందిగ్ధం నెలకొంది. దీనిని బట్టి గతంలో ఆయన పాదయాత్ర చేసిప్పటి పరిస్థితులకి నేటికీ చాలా తేడా వచ్చినట్లు అర్ధం అవుతోంది. అప్పుడు ఆయన తెలంగాణకు అనూకలంగా లేఖ ఇచ్చినప్పటికీ, ఈవిధంగా పార్టీలో కానీ, ప్రజల నుండి కానీ వ్యతిరేఖత కానరాలేదు. బహుశః ఆయన లేఖ ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ రాష్ట్ర విభజన చేస్తుందని ఎవరూ విశ్వసించక పోవడం వలననే అప్పుడు ప్రజలు కూడా పెద్దగా పట్టించుకోకపోయి ఉండవచ్చును. కానీ, రాష్ట్ర విభజన అనివార్యంగా కనబడుతున్నఈ తరుణంలో అందుకు అనుకూలంగా లేఖ ఇచ్చారనే కాంగ్రెస్, వైకాపాల ప్రచారం వలన చంద్రబాబు యాత్రకి అభ్యంతరాలు ఎదురవుతున్నాయి.
http://www.teluguone.com/news/content/chandrababu-39-25464.html