చంద్రులకు చుక్కలు చూపించిన మోడీ..!
Publish Date:Jul 28, 2017
Advertisement
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం షాకిచ్చింది. చంద్రబాబు, కేసీఆర్ ఆశలపై మోడీ నీళ్లు చల్లేశారు. అసెంబ్లీ సీట్ల పెంపుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఇరువురికి పొలిటికల్‌గా దిమ్మదిరిగే మాట చెప్పింది. 2019 ఎన్నికలకు ముందు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు ఉండబోదని ఆఫ్ ద రికార్డ్ తేల్చిచెప్పేసింది. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీనే దీనిపై క్లారిటీ ఇచ్చేశారు. ఢిల్లీ టూర్లో మోడీని కలిసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు అంశాన్ని ప్రస్తావించారు. అయితే 2026లో ఎలాగూ పెరుగుతాయి కదా అని మోడీ అన్నారని కేసీఆర్ వెల్లడించారు. పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణలో అసెంబ్లీ సీట్లు పెంచాలని మోడీని కోరానని, అయితే ఇప్పుడు ప్రక్రియ ప్రారంభించినా ఎలాగూ ఐదేళ్లు పడుతుందని ప్రధాని చెప్పారని, దాంతో ఇప్పట్లో నియోజకవర్గాల పెంపు లేనట్లేనని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. అయితే నియోజకవర్గాల పెంపుపై ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసినా ప్రక్రియ పూర్తవడానికి ఐదేళ్లు పడుతుందని మోడీ చెప్పారని, కానీ మూడు నాలుగు నెలల్లోనే మొత్తం ప్రక్రియను పూర్తి చేయవచ్చని, అయితే కేంద్రం ఎందుకు సీరియస్‌గా దృష్టిపెట్టడం లేదో అర్ధం కావడం లేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. పైగా తెలుగు రాష్ట్రాలు రెండూ కూడా సీట్లు పెంచాలని కోరుతున్నా... కేంద్రం పట్టించుకోవడం లేదన్న కేసీఆర్.... తెలంగాణ తరపున ప్రయత్నం చేస్తూనే ఉంటామన్నారు. అయితే తెలుగు రాష్ట్రాల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లే... వెంకయ్యనాయుడు... ఉపరాష్ట్రపతిగా వెళ్లడం కొంత నష్టమేనని కేసీఆర్ వ్యాఖ్యానించారు. 2019లోపు అసెంబ్లీ సీట్ల పెంపునకు కేంద్రం విముఖత చూపడానికి రాజకీయ వ్యూహమే కారణమంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎదగాలనుకుంటోన్న బీజేపీకి.... అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుతో ఒరిగేదేమీ లేదని తేలడంతోనే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల డిమాండ్‌ను పట్టించుకోవడం లేదని అంటున్నారు. అంతేకాదు తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతలు ఇచ్చిన రిపోర్ట్‌తోనే అసెంబ్లీ సీట్ల పెంపునకు కేంద్రం నో చెప్పిందనే టాక్ వినిపిస్తోంది.
http://www.teluguone.com/news/content/chandrababu-45-76611.html





