రాజ్యసభలో… ఇక మీద వెంకయ్య మంత్రం, అమిత్ షా తంత్రం!
Publish Date:Jul 27, 2017
Advertisement
వాళ్లిద్దర్నీ చాణక్య, చంద్రగుప్తులు అనాలో, శ్రీకృష్ణార్జునులు అనాలో, శ్రీరామ, హనుమంతులనాలో… మన ఇష్టం! కానీ, మోదీ, అమిత్ షా మాత్రం ప్రస్తుతం దేశాన్ని నడుపుతోన్న బ్రెయిన్ అండ్ హార్ట్! నిజానికి షా కేంద్ర ప్రభుత్వంలో భాగం కాకపోయినా మోదీ తరువాత అంత పవర్ ఫుల్ అని అందరి ఫీలింగ్. ఆయన బీజేపి పార్టీ జాతీయ అధ్యక్షుడుగానే వున్నప్పటికీ అనేక పరిణామాల్ని రిమోట్ క్రంటోల్ చేస్తున్నారు. కాని, తాజాగా కమలం పార్టీ పార్లమెంటరీ బోర్డ్ తీసుకున్న నిర్ణయం అమిత్ షాను నేరుగా పార్లమెంట్ ఆవరణలోకి తీసుకురానుంది! ఇక మీదట ప్రత్యక్ష యుద్ధమంటూ సంబరిపడిపోతున్నారు మోదీ భక్తులు! అమిత్ షా గుజరాత్ తరుఫున రాజ్యసభ ఎంపీగా నామినేషన్ వేస్తారని స్పష్టమైపోయింది. బీజేపి కంచుకోటా, మోదీ స్వంత రాష్ట్రమైన గుజరాత్ నుంచి పోటీ అంటే.. షాకు గెలుపు నల్లేరు మీద నడకే! అయితే, పార్టీ చీఫ్ గా దూసుకుపోతున్న అమిత్ భాయ్ ని నరేంద్ర భాయ్ పెద్దల సభకి ఎందుకు తెస్తున్నారు? రీజన్ అందరికీ తెలిసిందే! 2014 నుంచీ ఇప్పటి వరకూ అనేక విజయాలతో లోక్ సభలో తిరుగులేకుండా చేసుకున్నారు నమో. కాని, సమస్యంతా రాజ్యసభలో వస్తోంది. ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు కమ్యూనిస్టులు, ఇంకో వైపు తృణమూల్ నిరంతరం మోకాలు అడ్డువేస్తున్నాయి ప్రధానికి. అలాగే, శివసేన లాంటి ఎన్డీఏ పక్షాలు కూడా రాజ్యసభ మద్దతు విషయం వచ్చే సరికి బేరసారాలు, బెదిరింపులకి దిగుతున్నాయి! వీటన్నిటికి చెక్ పెట్టడానికే మోదీ తన మంత్రి లాంటి అమిత్ షాని రాజ్యసభకి తీసుకురాబోతున్నారు! అమిత్ షానే కాదు.. రాజ్యసభ పట్టులోకి తెచ్చుకోటానికి వెంకయ్యని కూడా ప్రయోగించారు ప్రధాని. కేంద్ర మంత్రిగా యాక్టివ్ గా వున్న ఆయన్ని ఉప రాష్ట్రపతి అంటూ గౌరవించేశారు! దీంతో మోదీకి కేబినేట్లో ఒక సీనియర్ తగ్గటమే కాక రాజ్యసభకు చైర్మన్ గా వెంకయ్య లాంటి సమర్థులు దొరుకుతారు. ఇటు వెంకయ్య, అటు అమిత్ షా ఇద్దర్నీ పెద్దల సభలో మోహరించటం ద్వారా మోదీ అక్కడ వ్యవహారాలన్ని వారి భుజాల మీద పెట్టేయవచ్చు. అప్పుడు ఆయన రానున్న 2019ఎన్నికలతో సహా చైనా, పాకిస్తాన్ లాంటి తలనొప్పులు కూడా పరిష్కరించుకునే ప్రయత్నం చేయవచ్చు. అయితే, కొందరు ఊహాగానాలు చేస్తున్నట్టు అమిత్ షాని కేంద్ర కేబినేట్లోకి కూడా మోదీ తీసుకుంటే బీజేపి అధ్యక్ష బాధ్యతలు మరెవరికైనా ఇవ్వాల్సి వుంటుంది. అత్యంత తాజాగా బీహార్ ని బుట్టలో వేసుకున్న అమిత్ షా రేంజ్లో… వేరే వారు పార్టీని నడుపుతారా? ఇది పెద్ద ప్రశ్నే! తగిన జవాబు మోదీ వద్ద వుందా? కొన్నాళ్లు ఆగితే తెలిసిపోతుంది!
http://www.teluguone.com/news/content/amit-shah-bjp-bjp-parliamentary-board-rajya-sabha-election-gujarat-45-76599.html





