ఉసిళ్ల పుట్ట మాదిరి ఉద్యోగులు.. మిలియన్ మార్చ్ గుర్తొచ్చిందా జగన్?
Publish Date:Feb 3, 2022
Advertisement
చలో విజయవాడ ప్రోగ్రామ్ లో కదం తొక్కుతున్న ఉద్యోగులను చూస్తుంటే ఓ పాత జ్ఞాపకం గుర్తొస్తుంది ఎవరికైనా. ప్రత్యేక తెలంగాణ కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దాదాపు పదేళ్ల క్రితం జరిగిన మిలియన్ మార్చ్ గుర్తుకు రావాల్సిందే. ఉద్యోగులు, ఉద్యమకారులు పక్కా ప్లాన్ తో అనుకున్న టైంకి ఎలా చేరుకోవాలో ప్రిపేరయ్యారు. అడుగడుగునా పోలీసులుంటారు కాబట్టి ట్యాంక్ బండ్ మీదికి ఎలా చేరుకోవాలో మందే భారీ పథకం సిద్ధం చేసుకున్నారు. ముళ్లకంచెలు, ముందస్తు అరెస్టులు.. ఇవన్నీ ముందు ఊహించినవే. అవెలాగూ ఉంటాయి. అయినా అనుకున్న చోటుకు వెళ్లి తీరాలి అనేదే వారి దృఢ సంకల్పం. అందులో భాగంగా ఉద్యోగులు, ఉద్యమకారులు వివిధ టీములుగా విడిపోయారు. ఏ టీము ఎక్కడ ఉండాలో క్రితం రోజు రాత్రే చేరుకున్నారు. ఎవరు ఏ టైమ్ కి ఎటువైపు నుంచి ట్యాంక్ బండ్ మీదికి రావాలో ముందే అనుకున్నారు. ఒక్కొక్కరు, ఇద్దరిద్దరు సాధారణ పౌరుల్లా నెమ్మదిగా ట్యాంక్ బండ్ వైపు కదిలారు. ఒక్కొక్క మనిషే కనిపిస్తున్నా... కొన్ని నిమిషాల్లోనే లెక్కలేనంత మంది జమయ్యారు. జనసంద్రాన్ని తలపించారు. పోలీసులు చేతులెత్తేశారు. ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ కూడా లైవ్. సరిగ్గా అలాంటి దృశ్యమే ఇవాళ విజయవాడలో కనిపించింది. కొత్త పీఆర్సీ వద్దని, పాత పీఆర్సీనే ముద్దని, తాజా ఉత్తర్వులను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఏపీ ఉద్యోగులంతా డిమాండ్ చేస్తున్నారు. సమ్మెకు ముందు ప్రిపరేషనల్ సమ్మిట్ గా చలో విజయవాడను సక్సెస్ చేసి ప్రభుత్వానికి తమ సత్తా ఏంటో చూపాలనుకున్నారు. సక్సెస్ అయ్యారు. పోలీసుల కళ్లుగప్పి, వారి దృష్టిని దారి మళ్లించి ఉద్యోగులంతా బీఆర్టీఎస్ రోడ్డుకు చేరుకోవడం అచ్చంగా ఓ డిటెక్టివ్ సినిమాను తలపిస్తుందంటే ఆశ్చర్యపోవాల్సిందేం లేదు. రైతుల వేషంలో కొందరు, వికలాంగుల వేషంలో కొందరు, బిచ్చగాళ్ల వేషంలో మరికొందరు, సామాన్య సిటిజన్లలా మరికొందరు, దారిన పోయే దానయ్యల్లాగా ఇంకొందరు... ఇలా అందరూ కూడా ఉద్యోగస్తుల్లా కాకుండా మారువేషాల్లోనే సమావేశ స్థలానికి చేరుకోవడం నిజంగా ఓ చారిత్రక ఘట్టం. కాబట్టి ఇప్పటికైనా సర్కారు ఉద్యోగుల సరైన డిమాండ్లను పెద్దమనసుతో అంగీకరించి చర్చలకు ఆహ్వానించి ఓ పరిష్కరాన్ని కనుగొంటే బాగుంటుంది. లేకపోతే.. అదిగో ఆనాడు మిలియన్ మార్చ్ ఘటనలాగే... ఇక్కడ విజయవాడలో ఉద్యోగులంతా ఉద్యమకారులై రోడ్డెక్కారు. కాబట్టి విఫలమయ్యే కొశ్చనే లేదంటున్నారు ఏపీ ప్రజలు. దీన్నంతా పరిశీలిస్తున్న జగన్ ఓ మంచి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది.
http://www.teluguone.com/news/content/chalo-vijayawada-on-the-lines-of-million-march-39-131183.html





