జగన్ ది హిట్ అండ్ రన్ రాజకీయం: వైసీపీ అధినేత ఓ క్రిమినల్ లిటిగెంట్.. చంద్రనిప్పులు.!
Publish Date:Oct 24, 2026
Advertisement
వైసీపీ అధినేత జగన్ పొలిటికల్ పాలసీలను ఏపీ సీఎం చంద్రబాబు దుయ్యబట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను అడ్డుకునేందుకు, ప్రజాస్వామ్య వ్యవస్థను పక్కనబెట్టి అరాచకాలు సృష్టించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ముఖ్యంగా వైసీపీ అధినేత హిట్ అండ్ రన్ తరహా రాజకీయం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. జగన్ బాధ్యతారహితంగా, ఒక క్రిమినల్ లిటిగెంట్లా వ్యవహరిస్తున్నారన్నారు. శనివారం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. గతంలో స్థానిక ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న దౌర్జన్యాలు, హింసాత్మక ఘటనలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించి, నాడు జగన్ హయాంలో అరాచకం ఏ రకంగా స్వేరవిహారం చేసిందో చూపి మరీ ఆ పార్టీ తీరును దుయ్యబట్టారు. ఈ సందర్భంగా వైసీపీ హయాంలో సాగిన దౌర్జన్యాలు, అబద్ధాలు, అరాచకాలను వివరిస్తూ.. అదే హింస... అవే అబద్ధాలు... అవే అరాచకాలు అనే శీర్షికతో రూపొందించిన బుక్లెట్ చంద్రబాబు ఆవిష్కరించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకమైన, పవిత్రమైన ఎన్నికల నిర్వహణ ప్రాధాన్యతను నొక్కిచెప్పిన ఆయన దేశంలో రాజ్యాంగబద్ధంగా స్వయంప్రతిపత్తి కలిగిన ఎన్నికల వ్యవస్థ పనిచేస్తోందని, కానీ గత ప్రభుత్వ హయాంలో ఈ వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమం, సుపరిపాలన ద్వారా మాత్రమే నిజమైన పారదర్శక పాలన సాధ్యమవుతుందని, విపక్షాల అరాచక రాజకీయాలను ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తున్నారనిఅన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్య వ్యవస్థలను పూర్తిగా అపహాస్యం చేశారన్న చంద్రబాబు స్వయంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హోదాలో ఉన్న అధికారి కూడా తనకు ప్రాణభయం ఉందంటూ ఫిర్యాదు చేయాల్సిన దుస్థితి అప్పట్లో దాపురించిందని గుర్తుచేశారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు విపక్షాల అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా బెదిరించడం, దాడులు చేయడం, నామినేషన్ పత్రాలను చింపివేయడం వంటి అరాచకాలకు వైసీపీ శ్రేణులు పాల్పడిందని చెప్పారు. జగన్ అరాచక పాలనను భరించలేక జనం 2024 ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి చరిత్రాత్మక మద్దతు ఇచ్చారని చంద్రబాబు చెప్పారు. తమపై ప్రజలు ఉంచిన అపారమైన నమ్మకానికి ఆ విజయం ప్రతీక అన్న ఆయన.. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి తమ ప్రభుత్వం అనునిత్యం శ్రమిస్తోందని వివరించారు. ప్రజల మద్దతు కోల్పోయిన వైసీపీ ఇంకా పాత పద్ధతుల్లోనే వ్యవహరిస్తోందన్న చందరబాబు, అభివృద్ధిని అడ్డుకోవడం, రాష్ట్రాన్ని అస్థిరపరచడం, అబద్ధపు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టడం వంటి పద్ధతులనే వారు ఇప్పటికీ నమ్ముకున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలు తమ ప్రజాస్వామ్య హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకునేలా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఎలాంటి హింసాత్మక ఘటనలనైనా కఠినంగా అణచివేస్తామని హెచ్చరించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేయాలని చూస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని కుండబద్దలు కొట్టారు.
[CBN Say Jagan Criminal Litigant, YCP Violence, Local Body Elections, Andhra Pradesh Politics, Telugu One]
http://www.teluguone.com/news/content/cbn-say-jagan-criminal-litigant-39-235279.html




