ఆటో నారాయణ!
Publish Date:Oct 4, 2025
Advertisement
ఆటో డ్రైవర్ల కష్టాన్ని సీఎం చంద్రబాబు దగ్గరగా చూశారనీ, అందుకే వారి కష్టాలను తీర్చేందుకే ఆటో డ్రైవర్ల సేవలో అనే పథకానికి శ్రీకారం చుట్టారని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. స్త్రీ శక్తి పథకం వల్ల నష్టపోతున్నామంటూ డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేయడంతో వారికి అండగా నిలిచేందుకు ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఇచ్చేందుకు చంద్రబాబు ముందుకు వచ్చారని వెల్లడించారు. ఆటో డ్రైవర్ల సేవలో పథకం అమలు చేయడం వల్ల ఏపీ ప్రభుత్వంపై రూ.466 కోట్ల భారం పడనుందని వివరించారు. స్త్రీ శక్తి పథకం వల్ల జీవనోపాధి ఇబ్బంది ఎదురైన ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సాయం చేసి సీఎం చంద్రబాబు గొప్ప మనసు చాటుకున్నారని మంత్రి నారాయణ కొనియాడారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్న చంద్రబాబు నాయుడు, ఆటో డ్రైవర్ల కోసం కూడా నూతన పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. అలాగే ఆటో యజమానుల కోసం ప్రభుత్వం గ్రీన్ ట్యాక్స్‌ను కుదించిందని, రూ.20 వేలు ఉన్న గ్రీన్ ట్యాక్స్ ను ప్రభుత్వం రూ.3 వేలకు తగ్గించడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్ల సేవలో పథకం కింద అందే సహాయం వాహన రిపేర్లు, కుటుంబ అవసరాలు, ఇతర ప్రయోజనాలకు ఉపయోగపడుతుందన్నారు. అన్ని వర్గాల ప్రజలు సీఎం చంద్రబాబుని ఆశీర్వదించాలని ఈ సందర్భంగా నారాయణ కోరారు. ఇక పోతే ఆటో డ్రైవర్ల సేవలో పథకం శనివారం (అక్టోబర్ 4) నుంచి ఆరంభమైన సందర్భంగా ఒంగోలులో జరిగిన ఆటో డ్రైవర్ల భారీ ర్యాలీలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఆటో డ్రైవర్ల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా చెప్పారు.
http://www.teluguone.com/news/content/cbn-brings-auto-friverla-sevalo-scheme-36-207334.html





