జగన్ కు షాక్: అక్రమాస్తుల కేసులో రోజు వారీ విచారణ, వ్యక్తిగత హాజరు: సీబీఐ కోర్టు నిర్ణయం.!
Publish Date:Oct 14, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి హైదరాబాద్లోని నాంపల్లి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం షాక్ ఇచ్చింది. జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది. సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. ఈ విచారణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసే దిశగా నాంపల్లి సీబీఐ కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుల్లో ప్రధాన నిందితుడు జగన్ తో పాటు మిగిలిన నిందితులందరినీ కూడా స్వయంగా కోర్టు ముందుకు తీసుకురావాలని కోర్టు స్పష్టం చేసింది. జగన్ సహా మొత్తం 70 మంది నిందితులను వ్యక్తిగతంగా విచారించేలా ఈ ప్రక్రియ సాగుతుందని విస్పష్టంగా పేర్కొంది. గతంలో ఈ కేసుల విచారణ నెమ్మదిగా సాగుతోందన్న కోణంలో విచారణను రోజువారీ ప్రాతిపదికన చేపట్టాలని కోరుతూ ఈడీ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న ఈ కేసుల విచారణ త్వరగా ముగించి స్పష్టత తీసుకురావాలని ఈడీ ఆ పిటిషన్లో కోరింది. ఈ అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన సీబీఐ ప్రత్యేక కోర్టు, రోజువారీ విచారణను పట్టాలెక్కించింది. ఈ కేసుల్లో ఉన్న నిందితుల సంఖ్య పెద్దది కావడం, అలాగే దాఖలైన చార్జ్షీట్లు, పత్రాల పరిమాణం విస్తృతంగా ఉండటంతో న్యాయస్థానం తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటివరకు వాయిదాలు, మినహాయింపులతో కాలయాపన జరుగుతోందన్న అభిప్రాయాలకు చెక్ పెడుతూ, ధర్మాసనం స్వయంగా అందరినీ ప్రత్యక్షంగా విచారించేందుకు సిద్ధమైంది. అక్రమాస్తుల కేసులకు సంబంధించి గత కొన్నేళ్లుగా సీబీఐ, ఈడీ దాఖలు చేసిన పలు చార్జ్షీట్లపై విచారణ కొనసాగుతోంది. కోర్టు నిర్ణయం నేపథ్యంలో ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐఏఎస్ అధికారులు, ప్రముఖ వ్యాపారవేత్తలు, ఇతర రాజకీయ నాయకులు స్వయంగా రోజు వారీ విచారణకు కోర్టుకు హాజరు కాకతప్పని అనివార్యత ఏర్పడింది. రోజువారీ విచారణతో ఇప్పటివరకు వాయిదాల మీదే నడుస్తున్న ఈ కేసుల పురోగతి వేగం పుంజుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ పరిణామాల నేపథ్యంలో నిందితులుగా ఉన్న వారు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయిస్తారా లేదా నాంపల్లి కోర్టు ఉత్తర్వుల ప్రకారం రోజువారీ హాజరవుతారా అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ప్రతిరోజూ కోర్టు విచారణ సజావుగా సాగితే, ఈ కేసుల్లో తీర్పుల ప్రక్రియ కూడా వేగవంతం అయ్యే అవకాశం ఉందని న్యాయనిపుణులు విశ్లేషిస్తున్నారు.
[CBI Court Shok Jagan, YS Jagan Mohan Reddy, CBI Special Court Nampally, Disproportionate Assets Case, Enforcement Directorate, Telugu One]
http://www.teluguone.com/news/content/cbi-court-shok-jagan-25-234356.html





