వివేకా హత్య కేసులో సీబీఐ సైలంట్
Publish Date:Sep 14, 2022
Advertisement
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఓ ప్రజాప్రతినిధి సహా కీలక వ్యక్తుల అరెస్ట్ ఉంటుందని సమాచారం వచ్చీ రాగానే జగన్ హుటాహుటిన ఢిల్లీ టూర్ వెళ్తారు. అంతే ఏపీలో సీబీఐ అధికారులు సైలెంట్ అయిపోయారు. వివేకా హత్య కేసులో సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం సహాయ నిరాకరణ చేస్తున్నది. ఎదురు కేసులు కూడా పెడుతుంది. ఈ కేసులో కీలక వ్యక్తులను అరెస్టు చేద్దామంటే.. ఢిల్లీ నుంచి బ్రేకులు పడుతుంటాయి. కింది స్థాయిలో డొంక కదిలిద్దామంటే.. వ్యూహాత్మకంగా ప్రైవేటు కేసులు వేయిస్తున్నారు. దీంతో సీబీఐ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారిందంటున్నారు. ఇలాగైతే వివేకా హత్య కేసు విచారణ ముందుకు సాగదని కోర్టుకు సీబీఐ మొర పెట్టుకుంది. దీంతో సంచలనం రేపిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ చేతులెత్తేసినట్లేనా? ఎడాపెడా ఒత్తిళ్లతో అధికారులు ఇక అడుగు ముందుకు వేయలేమనే భావనకు వచ్చారా? తమపై రాష్ట్ర పోలీసులు ఎదురు కేసులు పెడుతుండటంతో నైతిక స్థైర్యం దెబ్బతిని, ముందుకు వెళ్లేందుకు జంకుతున్నారా? వివేకా కేసులో కీలక వ్యక్తి అరెస్టు జరగొచ్చని బలంగా వార్తలు రాగానే.. దర్యాప్తు అధికారిపై కేసులు పెడుతున్నారు. ప్రైవేటు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇలాగైతే.. వివేకా హత్య కేసులో దర్యాప్తు ముందుకు సాగడం కష్టం. ఆ కేసులు కొట్టేయాలన్న మా వ్యాజ్యంపై త్వరగా విచారణ జరపండి అని సీబీఐ తరపు న్యాయవాది హైకోర్టుకు మొర పెట్టుకున్నారు. వివేకా కుమార్తె డాక్టర్ సునీతపైనా కేసుపెట్టారు. ఆ ఫిర్యాదులను పోలీసులకు కోర్టు రిఫర్ చేయగానే.. ఏకంగా ఏఎస్పీపైనే కడప పోలీసులు కేసు పెట్టడం గమనార్హం. ఈ పరిణామాల నేపథ్యంలో వివేకా హత్య కేసు దర్యాప్తులో వేగం కొన్నాళ్లుగా మందగించింది. కోర్టు ఆదేశాల మేరకు వివేకా హత్య కేసును చేపట్టిన సీబీఐ.. కడపలో మకాం వేసి మూలాల్లోకి చొచ్చుకెళ్లి తీగ లాగడం మొదలు పెట్టింది. ఈ కేసులో డ్రైవర్ దస్తగిరి అప్రూవర్ గా మారడం కీలక పరిణామం. దర్యాప్తులో గుర్తించిన విషయాలు, సేకరించిన సాక్ష్యాల ఆధారంగా.. వివేకా అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డి, ఎంపీ అవినాశ్ రెడ్డి అనుచరుడు దేవిరెడ్డి శంకర్ రెడ్డిపై అభియోగాలు మోపింది. ఈ కేసులో సీబీఐ ఇప్పటికి ఐదుగురిని జైలుకు పంపింది. 'అసలు సూత్రధారులు ఎవరో తేలుస్తాం' అని చార్జిషీట్ లో పేర్కొంది. దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ చేపట్టిన కేసుల్లో పకడ్బందీగా దర్యాప్తు చేస్తుంది. వివేకా హత్య కేసులోనూ అదే జరిగింది. సీబీఐ పేరు చెబితే దేశవ్యాప్తంగా బడాబడా వ్యక్తులే వణుకుతుంటారు. ఏపీలో మాత్రం సీబీఐనే వణుకుతుండటం గమనార్హం. అనేక అంశాల్లో వైసీపీ స్థానిక పెద్దల పాత్రపై లింకులు ఈ కేసులో వెలుగుచూశాయి. వీటి ఆధారంగా కీలక వ్యక్తుల అరెస్టుకు సీబీఐ రంగం సిద్ధం చేసినా.. బ్రేకులు పడుతూనే ఉండడం గమనార్హం. ఇన్ని అవాంతరాల మధ్య వివేకా హత్య కేసు దర్యాప్తు ముందుకు సాగుతుందా? లేక సీబీఐ ఇంకా సైలెంట్ అవుతుందా? కాలమే నిర్ణయించాలి.
విపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ దర్యాప్తుకు డిమాండ్ చేసిన జగనే.. అధికారంలోకి రాగానే ఆ డిమాండ్ ను పక్కన పెట్టడమే కాకుండా తన బాబాయి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు అవసరం లేదని కోర్టుకు విన్నవించారు. ఈ క్రమంలోనే వివేకా కుమార్తె డాక్టర్ సునీత హై కోర్టును ఆశ్రయించారు. తర్వాత ఈ కేసులో సీబీఐ అడుగులు వేగంగా పడ్డాయి. కీలక వ్యక్తుల అరెస్టుకు సిద్ధమైన ప్రతిసారీ సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లడం రివాజుగా మారింది. అక్కడ ఢిల్లీ పెద్దలతో ఆయన ఏం మాట్లాడతారో కానీ.. ఇక్కడ మాత్రం ఈ కేసులో సీబీఐ సైలెంట్ అయిపోవడం జరుగుతోంది. వారంలో కీలక పరిణామాలు జరగనున్నాయని.. వివేకా హత్య కేసులో కీలక ప్రజాప్రతినిధి అరెస్టుకు సీబీఐ రెడీ అయిందని ఆగస్టు నెలలో విస్తృతంగా ప్రచారం జరిగింది. పులివెందులలో పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. అదే సమయంలో ఆగస్టు 21న సీఎం జగన్ ఆగమేఘాల మీద ఢిల్లీ వెళ్లారు. 22న ఢిల్లీ పెద్దలను కలిశారు. అంతే.. ఇక్కడ సీబీఐ గప్ చుప్ అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి దాకా ఈ కేసు విషయంలో సీబీఐలో ఉలుకూ పలుకూ లేదు.
http://www.teluguone.com/news/content/cbi-became-silent-in-viveka-murder-case-25-143748.html





