తమిళనాట రాజుకున్న కావేరీ జలాల చిచ్చు.!
Publish Date:Aug 2, 2026
Advertisement
తమిళ రాజకీయాల్లో కావేరి జలాల చిచ్చు రేగింది. దశాబ్దాలుగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా మారిన కావేరి జలాల పంపకం సమస్య.. మేకెదాటు ప్రాజెక్ట్ నిర్మాణం వివాదం తాజాగా పీక్స్ కు చేరుకున్నాయి. కావేరి నదీ జలాల హక్కుల పరిరక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. తాజాగా ఈ వివాదం పెచ్చరిల్లడానికి ప్రతిపక్షాల అఖిలపక్షం డిమాండ్ ను ముఖ్యమంత్రి విజయ్ తిరస్కరించడమే కారణమని పరిశీలకులు చెబుతున్నారు. ప్రతిపక్ష డీఎంకే, ఇతర పార్టీలు కావేరీ జల వివాదంపై అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయగా, సీఎం విజయ్.. ఇప్పటికే శాసనసభలో కావేరి నీటి హక్కులపై ఏకగ్రీవ తీర్మానం చేశామని, అందుకే మళ్లీ ప్రత్యేకంగా అఖిలపక్ష భేటీ అవసరం లేదని అకుండబద్దలు కొట్టారు. దీంతో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ ముఖ్యమంత్రి విజయ్ కావేరి వివాదంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. కావేరి జలాలు తమిళనాడుకు అత్యంత కీలకమనీ, ఇతర రాష్ట్రాల వ్యూహాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఏకాభిప్రాయ సాధన అవసరమని అన్నారు. ప్రతిపక్షాల విజ్ఞప్తులను పక్కనబెట్టి సొంత నిర్ణయాలతో ముందుకు వెళ్లడం వల్ల తమిళనాడు రైతులకు న్యాయం జరగదన్నారు. సీఎం తీరుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చారు. అదలా ఉండగా, కర్ణాటక ప్రభుత్వం కావేరి పరివాహక ప్రాంతంలో మేకెదాటు డ్యామ్‌ను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో, ఈ సమస్యను పరిష్కరించడానికి ముఖ్యమంత్రి విజయ్ స్వయంగా కర్ణాటక పర్యటనకు సిద్ధమయ్యారన్న వార్తలు విపక్షాలలో మరింత ఆందోళనకు కారణమయ్యాయి. చర్చల ద్వారా సమస్య తీరదనీ, న్యాయపోరాటం ద్వారానే తమిళనాడు హక్కులను కాపాడుకోవాలని విపక్షలు అంటున్నాయి. కర్ణాటక ప్రభుత్వం అక్కడ ప్రత్యేక అఖిలపక్ష భేటీ నిర్వహించి తమ రాష్ట్రంలో ఐక్యతను ప్రదర్శిస్తుంటే.. తమిళనాడులో మాత్రం అధికార, ప్రతిపక్షాల మధ్య విభేదాలు పెచ్చరిల్లుతున్నాయి. రాష్ట్రాల మధ్య నదుల అనుసంధానంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి చర్చించేందుకు అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లానని డీఎంకే డిమాండ్ చేస్తున్నది. ఒకవైపు ఆందోళన బాట పట్టిన డీఎంకే, మరోవైపు క్షేత్రస్థాయిలో నీటి కొరతతో అల్లాడుతున్న రైతులు, ఇంకోవైపు న్యాయపోరాటం చేయాలనే డిమాండ్లు... ఈ పరిణామాలు సీఎం విజయ్ కు సవాల్ గా మారాయి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత విజయ్ కు ఎదురైన అతి పెద్ద సవాల్ ఇదేనని రాజకీయపరిశీలకులు విశ్లేషిస్తున్నారు. CM Vijay, Cauvery Water Dispute, Tamil Nadu Politics, TVK vs DMK, Mekedatu Dam Row
http://www.teluguone.com/news/content/cauvery-water-dispute-ignites-in-tamilnadu-39-227829.html





