పవన్ కల్యాణ్, రఘురామ రాజుపై పై వివాదాస్పద వ్యాఖ్యలు.. జడ శ్రవణ్ కుమార్ పై కేసు
Publish Date:Jul 1, 2026
Advertisement
జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్‌పై ఏలూరులో కేసు నమోదైంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజులు లక్ష్యంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపాయి. గత నెల 28న ఏలూరులో దళిత క్రైస్తవుల నిరసన సభ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన జడ శ్రవణ్ కుమార్ ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు నాలుక కోసి దానిని నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు పార్సిల్ పంపిస్తానంటూ అభ్యంతరకరమైన,అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు ఏలూరు త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. సదరు నిరసన సభకు సంబంధించిన వీడియో రికార్డింగ్‌లను, సాక్ష్యాలను సేకరిస్తున్నారు. పవన్ కల్యాణ్, రఘురామకృష్ణంరాజుల అభిమానులు, కూటమి శ్రేణులు జడ శ్రవణ్ కుమార్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చట్టాన్ని గౌరవించాల్సిన ఒక లాయర్ ఇలాంటి హింసాత్మక భాషను వాడటం సరికాదని మండిపడుతున్నారు.
ఈ వివాదాస్పద వ్యాఖ్యల పట్ల సర్వత్రా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఏలూరులోని గొల్లాయిగూడేనికి చెందిన పెద్దాడ వెంకటరమణ అనే వ్యక్తి జడ శ్రవణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని, కులాల మధ్య, వర్గాల మధ్య విద్వేషాలు రగిలించేలా ఉన్నాయని పేర్కొంటూ.. ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఒక ప్రజాప్రతినిధిపై, ఉప ముఖ్యమంత్రిపై ఇలా వ్యాఖ్యలు చేయడం చట్టరీత్యా నేరమని ఫిర్యాదులో పేర్కొన్నారు.
http://www.teluguone.com/news/content/case-filed-against-jada-sravan-kumar--36-224814.html





