సోలంకీపై గృహహింస కేసు.. మోదీ ఇలాఖాలో కాంగ్రెస్‌లో కలవరం..
Publish Date:Mar 30, 2022
Advertisement
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమవుతోంది. ఈ సంవత్సరం (2022) చివర్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. గత (2017)లో జరిగిన ఎన్నికలో బీజేపీ అతికష్టం మీద అత్తెసరు మెజారిటీతో అధికారాన్ని నిలుపుకుంది. అయితే ఈ సారి కాంగ్రెస్ పార్టీ నుంచి మరింత గట్టి పోటీ ఎదుర్కుంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. మరో వంక ఉత్తర ప్రదేశ్ సహ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో, అంతటా ఓటమి పాలైన కాంగ్రెస్ పార్టీ, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలో సత్తా చాటు కునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఎన్నికల వ్యూహహకర్త ప్రశాంత్ కిశోర్’తోనూ ఒప్పందం కుదుర్చుకున్నట్లు వార్తలు అందుతున్నాయి. అయితే, అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధి, కేంద్ర మాజీ మంత్రి, భరత్ సింగ్ సోలంకీ భార్య రేష్మా పటేల్ చేసిన వ్యాఖ్యలు, సోలంకీ వ్యక్తిగత ఇమేజినే కాకుండా, కాంగ్రెస్ పార్టీ ఇమేజిని కూడా దెబ్బతీసేలా ఉందని పార్టీలో ఆందోళన వ్యక్తమవుతోంది. సోలంకీ పార్టీని ఎన్నికలకు సిద్దం చేసేపనిలో నిమగ్నమైన సమయంలోనే, ఆయన భార్య రేష్మా ఆయనపై గృహ హింస కేసు పెట్టారు. అంతే కాకుండా, ఆయనకు మరో మహిళా నాయకురాలితో అక్రమ సంబంధం ఉందని, ఆ కారణంగా సోలంకీ తనను చిత్రహింసలు పెట్టడమే కాకుండా ఇంటి నుంచి గెంటివేశారని ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ఆనంద్ బోర్సాద్ కోర్టులో పిటిషన్’లో దాఖలు చేశారు. ఇప్పుడు గుజరాత్ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్ అయ్యింది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు విచారణ చెయ్యడం మరింత కలకలం రేపింది. భగత్ సింగ్ సోలంకీ ఆషామాషీ నాయకుడు కాదు, మూడు తరాలుగా అయన కుటుంబం కాంగ్రెస్ పార్టీలో కీలక భూమికను పోషించింది. కేంద్ర మాజీ మంత్రిగా భరత్ సింగ్ సోలంకీ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతగా, కేంద్ర మంత్రిగా గతంలో గతంలో ఆయన చక్రం తిప్పాడు. రెండుసార్లు గుజరాత్ పీసీసీ అద్యక్షుడిగా పని చేశారు. భరత్ సింగ్ సోలంకీ తండ్రి మాధవ్ సింగ్ సోలంకి గుజరాత్’కు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా, కేంద్ర విదేశాంగా మంత్రిగా పని చేశారు. గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో భగత్ సింగ్ సోలంకీ పేరు కూడా ఉందని సమాచారం. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో భగత్ సింగ్ సోలంకీ ఆధ్వర్యంలోనే కాంగ్రెస్ పార్టీ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయింది. ఇప్పుడు ఎలాగైనా గుజరాత్’లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని భగత్ సింగ్ సోలంకీ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో సోలంకీ భార్య బాంబు పేల్చారు. అయితే భగత్ సింగ్ సోలంకీ పై ఆయన భార్య చేసిన ఆరోపణలను ఆయన ఇంతవరకు స్పందించలేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మౌనంగానే ఉన్నారు. అయితే, ఈ వివాదం ఎలాంటి మలుపు తీసుకుంటుందో, చూడవలసి ఉంటుందని పరిశీలకులు అంటున్నారు. గృహ హిసం కేసు నమోదు అయితే మాత్రం అది సోలంకీ రాజకీయ జీవితంపై న్ని విధాలా ప్రభావం చూపుతుందని అంటున్నారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా దెబ్బతీస్తుందని, పరిశీలకులు భావిస్తున్నారు.
నిజానికి సోలంకీ భార్య గతంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యనకు వచ్చిన సమయంలోనే సోలంకీ వ్యవహారం మొత్తాన్ని బహిరంగ లేఖ ద్వారా ఆయన (రాహుల్ గాంధీ) దృష్టికి తీసుకెళ్ళారు. అయినా, రేష్మా పటేల్ లేఖను రాహుల్ గాంధీ పట్టించుకోలేదు. ఇప్పుడు, ఆమె ఏకంగా భర్త సోలంకీ పై గృహ హింస కేసు పెట్టడంతో కాంగ్రెస్ పార్టీలో కలవరం మొదలైంది.
http://www.teluguone.com/news/content/case-against-bharat-solanki-in-gujarat-25-133725.html





