పురుగుమందులతో డయాబెటిస్
Publish Date:Jan 21, 2017
Advertisement
పంట దిగుబడిని వీలైనంత పెంచేందుకు విచ్చలవిడిగా వాడేస్తున్న పురుగులమందులతో ఎన్ని ప్రమాదాలు ఉన్నాయో కొత్తగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ పురుగుమందులతో మరో ఉపద్రవం ఉందంటూ వార్తలు వస్తున్నాయి. Carbaryl – carbofuran మన శరీరంలోని జీవక్రియల (మెటాబాలిజం) మీద పురుగుమందుల ప్రభావం తెలుసుకునేందుకు అమెరికా పరిశోధకులు కొన్ని విశ్లేషణలు సాగించారు. ఇందుకోసం వారు Carbaryl, carbofuran అనే రెండు పురుగుమందులను ఎన్నుకొన్నారు. ఈ రెండింటినీ కూడా చాలా దేశాలు నిషేధించాయి. కానీ భారతదేశంలో వీడి వాడకం ఇంకా కొనసాగుతూనే ఉంది. మనందరికీ గుర్తుండిపోయిన భోపాల్ గ్యాస్ దుర్ఘటన carbaryl తయారీ సందర్భంగానే జరిగింది. ఈ carbarylతో పంటలు పండించడం వల్ల, వాటిని తిన్నవారిలో కేన్సర్ సోకే అవకాశం ఉందని తేలింది. ఇక carbofuran అత్యంత విషపూరితమైన రసాయనాలలో ఒకటి. దీనిని పొరపాటున తినడం వల్ల లక్షలాది పక్షులు, జంతువులు చనిపోయాయని చెబుతారు. ఇక పంటల ద్వారా శరీరంలోకి చేరే ఈ రసాయనంతో మన నాడీవ్యవస్థ, జన్యువుల దెబ్బతింటాయని రుజువైంది. జీవగడియారం మీద ప్రభావం Carbaryl, carbofuranలు మనిషి శరీరంలోకి ప్రవేశించినప్పుడు మెలటోనిన్ అనే కణాలతో ఇవి బంధాన్ని ఏర్పరుచుకుంటున్నాయట. మనలోని జీవగడియారాన్ని అదుపు చేసే రసాయనమే ఈ మెలటోనిన్! అలాంటి మెలటోనన్ కనుక అస్తవ్యవస్తమైపోతే ఒంట్లోని ప్రక్రియలన్నింటి మీదా దాని ప్రభావం ఉంటుంది. ఉదాహరణకు పాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి కావడానికి ఒక నీర్ణీత సమయం ఉంటుంది. ఈ సమయంలో కనుక చీటికీ మాటికీ మార్పులు వస్తే అది డయాబెటిస్కు దారి తీస్తుంది. ఇతరత్రా సమస్యలెన్నో జీవగడియారం అస్తవ్యస్తం అయితే కేవలం డయాబెటిస్ మాత్రమే కాదు... నిద్ర, రక్తపోటు, గుండె, రోగనిరోధకశక్తి వంటి అనేక వ్యవస్థలు తారుమారైపోతాయి. అందుకనే ఇక మీదట పురుగుమందుల తీరుని విశ్లేషించేటప్పుడు, మెలటోనిన్ మీద వాటి ప్రభావాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలంటూ సూచిస్తున్నారు. Carbaryl, carbofuran వంటి వేలాది రసాయనాలు మన నిత్యజీవితంలో భాగమైపోయాయి. పురుగు మందులుగానో, దోమల మందుల రూపంలోనో, పెరటి చెట్లని పెంచేందుకో ఏదో ఒక సందర్భంలో అవి మనకి తారసపడుతూనే ఉన్నాయి. వీటిలో ప్రతి ఒక్క రసాయనం గురించి తెలుసుకునే అవకాశం మనకి ఉండదు కాబట్టి, ప్రభుత్వమే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. హానికారకమైన రసాయనాలని నిషేదించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. అది జరిగే పనే అంటారా! - నిర్జర.
http://www.teluguone.com/news/content/carbofuran-34-71327.html





