సాగునీరు తాగేస్తామన్న $10B డేటా సెంటర్: షాకిచ్చిన కాలిఫోర్నియా వాటర్ బోర్డు!
Publish Date:Jul 28, 2026
Advertisement
కాలిఫోర్నియాలోని ప్రశాంతమైన ఇంపీరియల్ వ్యాలీ వ్యవసాయ క్షేత్రాల్లో ఇప్పుడు ఊహించని మహా సంగ్రామం నడుస్తోంది. ఒకవైపు శతాబ్దాలుగా పంటలు పండిస్తూ నిత్యం పచ్చదనంతో కళకళలాడే వ్యవసాయ భూములు, మరొకవైపు కృత్రిమ మేధ (AI), డిజిటల్ యుగానికి వెన్నెముకగా నిలిచే భారీ డేటా సెంటర్ల దాహం! ఇంపీరియల్ వ్యాలీ కంప్యూటర్ మాన్యుఫ్యాక్చరింగ్ (IVCM) అనే సంస్థ, డెవలపర్ సెబాస్టియన్ రుచీ నేతృత్వంలో ఏకంగా $10 బిలియన్ డాలర్ల (దాదాపు 83,000 కోట్ల రూపాయలు) భారీ వ్యయంతో కాలిఫోర్నియాలోనే అతిపెద్ద 330 మెగావాట్ల (330 MW) డేటా సెంటర్‌ను నిర్మించేందుకు పూనుకుంది. అయితే ఈ అత్యాధునిక సూపర్‌కంప్యూటర్ ఐటీ సామ్రాజ్యానికి రోజువారీ కూలింగ్ ప్రక్రియ కోసం భారీగా నీరు అవసరమైంది. దాంతో ఆ కంపెనీ వేసిన మాస్టర్ ప్లాన్ స్థానికులతో పాటు ప్రభుత్వం లోనూ తీవ్ర కలకలం రేపింది. ఆ ప్లాన్ ఏంటంటే... డేటా సెంటర్ నిర్మించాలనుకుంటున్న కంపెనీ అక్కడి వ్యవసాయ భూములను నేరుగా కొనుగోలు చేసి, వాటికి అందే సాగునీటిని పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించింది! పంటల సేద్యానికి వాడే ఆ నీటిని నేరుగా తమ 330 MW డేటా సెంటర్ కూలింగ్ అవసరాలకు మళ్లించి, ఆ వ్యత్యాసాన్ని తాగునీరుగా మార్చుకోవాలనేది వారి ఆలోచన. తమ ప్రాజెక్ట్ వల్ల కొలరాడో నదిపై ఎలాంటి అదనపు భారం పడదని, వ్యవసాయ నీటినే వాడుకుంటున్నాం కాబట్టి ఇది 'జీరో ఇంపాక్ట్' ప్రాజెక్ట్ అని IVCM యజమాని రుచీ వాదించారు. డేటా సెంటర్ కూలింగ్ కోసం ఏడాదికి దాదాపు 880 ఎకరా-ఫీట్ల నీరు అవసరం. అంటే సుమారు 287 మిలియన్ గాలన్ల (దాదాపు 108 కోట్ల లీటర్ల) స్వచ్ఛమైన నీటిని డేటా సెంటర్ దారిన మళ్లించాలనేది వారి ప్లాన్. కానీ, కాలిఫోర్నియాలోనే అత్యంత శక్తివంతమైన నీటి పంపిణీ సంస్థ అయిన ఇంపీరియల్ ఇరిగేషన్ డిస్ట్రిక్ట్ (IID) ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించింది. కొలరాడో నది నుండి లభించే 3.1 మిలియన్ ఎకరా-ఫీట్ల నీటి హక్కులను పర్యవేక్షించే IID, మే 1, 2026న ఈ దరఖాస్తును ససేమిరా అని తోసిపుచ్చింది. డేటా సెంటర్ కోరుతున్న 880 ఎకరా-ఫీట్ల నీరు తమ మొత్తం నీటి వాటాలో కేవలం 0.03 శాతం మాత్రమే అయినప్పటికీ, దీనికి అనుమతి ఇస్తే భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయని స్పష్టం చేసింది. ఒక పరిశ్రమ కోసం రైతుల నోటికాడ కూడు గుంజడం, వ్యవసాయ భూములను ఎండబెట్టడం (Buy and Dry) వల్ల స్థానిక వ్యవసాయ ఆధారిత ఉద్యోగాలు దెబ్బతింటాయని హెచ్చరించింది. దాంతో IVCM సంస్థ నేరుగా కోర్టును ఆశ్రయించి ఐఐడీపై పిటిషన్ దాఖలు చేసింది. ivcm 330mw data center lawsuit,imperial valley irrigation district water case
http://www.teluguone.com/news/content/california-data-center-water-dispute-36-227418.html





